కేసీఆర్‌కు త‌లనొప్పిగా పార్టీ నేత‌ల అక్ర‌మాలు

కేసీఆర్‌కు త‌లనొప్పిగా పార్టీ నేత‌ల అక్ర‌మాలు

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో కొత్త క‌ల‌క‌లం మొద‌లైంది. పార్టీకి చెందిన మంత్రులు, విప్‌‌లు, ఎమ్మెల్యేలు వరుసగా వివాదాల్లో చిక్కుకోవడం అధికార టీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారుతోంది. తెలంగాణలో అధికార పార్టీ నేతల బాగోతలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. గత 10 రోజుల్లోనే ఇద్దరు మంత్రులు, విప్‌లు, నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భూ బాగోతం బయట పడింది. దీంతో పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ వారిపై క‌న్నెర్ర చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిపై చ‌ర్య‌లు ఉంటాయ‌ని అయితే అందుకు త‌గు స‌మ‌యం రావాల‌ని పార్టీ నేత‌లు అంటున్నారు.

తాజాగా మంత్రి జుపల్లి కృష్ణారావు త‌న‌యుల ఉదంతం వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.ఎస్‌బీఐ బ్యాంకుకు 86 కోట్ల కుచ్చుటోపి వేసిన వైనాన్ని విపక్షాలు అస్త్రాలుగా మలుచుకున్నాయి. ఈ విషయం కూడా తనదాకా చేరడంతో సీఎం జుపల్లి పై గుర్రు మీద ఉన్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియాకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారని ప్రధాన ప్రతి పక్షమైన కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది. తన అనుచరుల ద్వారా ఇసుక అక్రమ రవాణకు మంత్రి పాల్పడుతున్నారని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు పార్టీ సీనియ‌ర్ అయిన మంత్రి జగదీశ్ రెడ్డి కలెక్టరేట్ ను తన భూముల్లో వచ్చే విధంగా చేసి కోట్లు కూడ బెట్టారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కలెక్టరెట్ ను తన భూముల్లోకి మార్చరని విమర్శించారు. నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో తన ప్రమేయం లేదని జగదీశ్‌ రెడ్డి చెప్పించినా సీఎంకే అసలు సంగతి తెలిసినట్లు సమాచారం. మంత్రిని పిలిచి సీఎం గట్టిగా క్లాస్ తీసుకున్నారని ప్రచారం జ‌రుగుతోంది.

ఇదిలాఉండ‌గా...సౌమ్యుడిగా పేరున్నచీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తన నియోజకవర్గంలో 52 ఎకరాలను, సీఐకు చెందిన మూడు గుంటల భూమిని కబ్జా చేసి తన సతీమణి పేర రిజిస్టర్ చేసుకోవడం వివాదాల పాలయ్యింది. కొప్పుల ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం పార్టీకి నష్టమన్న అభిప్రాయంలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మరో వైపు విప్ గంపా గోవర్థన్ ప్రజా సమస్యలపై ప్రశ్నించిన మహిళను దుర్భాషలాడటం ఆయన అనుచరులు మహిళపై చేయి చేసుకోవడం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇక హైటెక్ సిటీ సమీపంలోని ఖానా మెట్ వద్ద అసైన్ లాండ్ ను కబ్జా చేసి విప్ బోడేకుంటి వెంకటేశ్వర్లు మాల్ నిర్మాణానికి ప్రయత్నిస్తే స్థానికులు అడ్డుకోవడం...బల్దియా అధికారులు నిర్మాణాన్ని నిలిపివేసిన వ్యవహరం కూడా మీడియాలో వైర‌ల్ అయింది. వీరే కాకుండా ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన‌ చిట్టా సీఎం కేసీఆర్ వద్ద ఉందని అంటున్నారు. ఈ వ్య‌వ‌హార‌శైలితో కేసీఆర్ ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే వీరిపై తక్షణం చర్యలు తీసుకుంటే..తప్పును ఒప్పుకున్నట్టవుతుందన్న భావనలో అచీ తూచీ వ్యవహరిస్తున్నారు కేసీఆర్. సమయం రాగానే అవినీతి, అక్రమాల మరకలున్న మంత్రులు, విప్ లను తొలగించడంతో పాటు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటారని అంటున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English