బాబు మోసం చేయ‌లేదు... వెంక‌య్య రాంగ్ !

బాబు మోసం చేయ‌లేదు... వెంక‌య్య రాంగ్  !

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పోరాటానికి అనుకోని మ‌ద్ద‌తు ద‌క్కింది. అది కూడా తెలంగాణ నుంచి కావ‌డం ఆశ్చ‌ర్యం.  ఢిల్లీలో పెద్ద‌ల‌కు మెద‌ళ్లు మోకాళ్ల‌లోకి జారాయ‌ని, ప‌నికిరాని విధానాల‌తో దేశాన్ని వెన‌క్కు న‌డిపిస్తున్నార‌ని తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌తో మొండిగా త‌యారైన కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించడానికే చంద్రబాబు నిరాహారదీక్షకు దిగుతున్నారని వీహెచ్ అన్నారు.

చంద్ర‌బాబు ఎన్న‌డూ ఏపీ ప్ర‌జ‌ల‌ను మోస‌గించ‌లేద‌న్నారు. మోసం ఏదైనా ఉంటే అది బీజేపీయే చేసింద‌న్నారు. కేంద్రం ప్ర‌భుత్వం, న‌రేంద్ర మోడీ మాట మీద నిల‌బ‌డ‌కుండా ఏపీ ప్రజలను మోసం చేశార‌ని, చంద్రబాబు ఏం మోసం చేయ‌లేద‌ని వి.హ‌నుమంత‌రావు అన్నారు. విభ‌జ‌న అనంత‌రం ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన మోడీ  ఆంధ్రప్రదేశ్  కు ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని, ఆ తర్వాత ఆ హామీని మ‌రిచిపోయి చంద్ర‌బాబు మీద చెప్పి త‌ప్పించుకుంటున్నార‌ని, ఇవ‌న్నీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌వా అంటూ వ్యాఖ్యానించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై వెంకయ్యనాయుడికి ఏమాత్రం ప్రేమ‌, చిత్తశుద్ధి ఉన్నా త‌న ఉపరాష్ట్రపతి పదవికి వెంటనే రాజీనామా చేయాలని వీహెచ్‌ డిమాండ్ చేశారు. ఉప‌రాష్ట్రప‌తిగా ఉన్న వెంకయ్య రాజీనామా చేస్తే దేశంలో ఒక అల‌జ‌డి వ‌స్తుంద‌ని, అపుడే మోదీ, అరుణ్ జైట్లీలకు భయం కలుగుతుందని సూచించారు.
వీహెచ్ మాట‌లు సాధార‌ణంగా జ‌నాభిప్రాయానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంటాయి. సాధార‌ణంగా ఏ ఇష్యూ అయినా జ‌నంలో నానేవే వీహెచ్ మాట్లాడుతుంటారు. ఆయ‌న పార్టీకి వీర విధేయుడిగా ఉంటూనే వాస్త‌వ అభిప్రాయాల‌ను వ్య‌క్తంచేయ‌డానికి ఏమాత్రం వెనుకాడ‌రు. ఆయ‌న వ్యాఖ్య‌లు కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా ఉండ‌క‌పోవ‌చ్చు గాని, ఇత‌ర పార్టీల విష‌యంలో వాస్త‌వాల‌ను మాట్లాడ‌టానికి ఆయ‌న ఏమీ బెణ‌క‌రు. వీహెచ్ మాట‌లు బాబుకు కొంత నైతిక ధైర్యాన్ని ఇస్తాయి. అన్యాయం గురించి మోడీని ప్ర‌శ్నించ‌కుండా చంద్ర‌బాబును ప్ర‌శ్నిస్తున్న వారికి కూడా ఇది ఒక చిన్న ఝ‌ల‌కే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు