చంద్ర‌బాబు విజ‌న్ కు టోనీ బ్లెయిర్ ఫిదా!

చంద్ర‌బాబు విజ‌న్ కు టోనీ బ్లెయిర్ ఫిదా!

2018 ఏప్రిల్ 13న సింగ‌పూర్‌లో జ‌రిగిన హిందుస్థాన్ టైమ్స్ `మింట్ ఆసియా లీడ‌ర్ షిప్ స‌మ్మిట్‌`లో ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ్మిట్ లో పాల్గొన్న వివిధ సంస్ధ‌ల సీఈవోల‌తో సీఎం చంద్ర‌బాబు నాయుడు భేటీ అయ్యారు. అమ‌రావ‌తికి వ‌చ్చి అక్క‌డి అభివృద్ధిని చూడాలని, చూసిన త‌ర్వాతే పెట్టుబ‌డులు పెట్టాల‌ని వివిధ సంస్థల సీఈవోల‌ను, సింగ‌పూర్ పారిశ్రామిక వేత్త‌ల‌ను చంద్ర‌బాబు కోరారు. ఆ స‌మ్మిట్ లో పాల్గొన్న‌ బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని టోనీ బ్లెయిర్ తో కూడా చంద్ర‌బాబు, ఏపీ మంత్రులు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఏపీకి సంబంధించిన ప‌లు కీల‌క‌మైన అంశాల‌పై బ్లెయిర్ తో చంద్ర‌బాబు చ‌ర్చించారు. కొత్త రాష్ట్రం ఎలా ఉంద‌ని టోనీ బ్లెయిర్...చంద్ర‌బాబును అడిగి తెలుసుకున్నారు. ఏపీ అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు, రాజ‌ధాని నిర్మాణ వివ‌రాలను ఆయ‌న‌కు చంద్ర‌బాబు వివ‌రించారు. త్వ‌ర‌లోనే ఏపీని సంద‌ర్శించాల‌ని బ్లెయిర్ ను చంద్ర‌బాబు ఆహ్వానించారు.

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి త‌న‌వంతు కృషి చేస్తాన‌ని, త‌న సంస్థ టోనీ బ్లెయిర్ ఇన్ స్టిట్యూట్ ఫ‌ర్ గ్లోబ‌ల్ ఛేంజ్ ద్వారా స‌హ‌కారమందిస్తాన‌ని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కేబినెట్ మంత్రుల‌తో స‌మావేశ‌మ‌య్యాన‌ని, వారికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధిపై ఉన్న విజ‌న్ గురించి మాట్లాడాన‌ని టోనీ బ్లెయిర్ తన ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేశారు. వారితో భేటీ అవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని చెప్పారు.  తాను ఉమ్మ‌డి ఏపీలోని మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ను సంద‌ర్శించాన‌ని బ్లెయిర్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. దేశంలోని 200 సంస్థ‌ల‌తో టీబీఐజీసీ ప‌ని చేస్తోంద‌ని బ్లెయిర్ తెలిపారు. త్వ‌ర‌లోనే నవ్యాంధ్ర‌కు టీబీఐజీసీ త‌ర‌ఫు నుంచి ఒక బృందాన్ని పంపుతాన‌ని తెలిపారు. న‌వ్యాంధ్ర అభివృద్ధిలో ఆ బృందం త‌మ వంతు సాయం చేస్తుంద‌ని బ్లెయిర్ చెప్పారు. కాగా, ఈ స‌మ్మిట్ లో పాల్గొన్న లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ తో కూడా చంద్ర‌బాబు భేటీ అయ్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు