ఆయ‌న అడ్డురాక‌పోతే..హ‌రిబాబుకే మంత్రి ప‌ద‌వి

ఆయ‌న అడ్డురాక‌పోతే..హ‌రిబాబుకే మంత్రి ప‌ద‌వి

ఆంధ్ర్రప్ర‌దేశ్‌లో బీజేపీ మ‌రింత బ‌లోపేతం చేసేందుకు పార్టీ జాతీయ అధిష్టానం క‌స‌రత్తు చేస్తోంది. మిత్ర‌పక్ష‌మైన‌ తెలుగుదేశం పార్టీ పొత్తుకు గుడ్‌బై చెప్పేయ‌డం అదే స‌మ‌యంలో త‌మ‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌టంతో తాము సైతం ఎదురుదాడి చేయాల‌ని ఇప్ప‌టికే క‌మ‌ళ‌నాథులు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. దీనికి తోడుగా పార్టీ శ్రేణుల‌కు మ‌రింత ఉత్సాహం ఇచ్చేందుకు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టే దిశ‌గా ఢిల్లీ పెద్ద‌లు ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ హరిబాబును కేంద్ర మంత్రి పదవి వరించబోతోందని తెలుస్తోంది. అయితే ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి ద‌క్కకుండా పార్టీలోని కొన్ని స‌మీక‌ర‌ణాలు అడ్డుప‌డుతున్నాయ‌ని అంటున్నారు.

ఏపీలో బ‌ల‌ప‌డేందుకు మార్గాలు అన్వేషిస్తున్న బీజేపీ ఇందుకు త‌గిన లెక్క‌ల‌ను సైతం విశ్లేషిస్తోంది. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రులుగా ఉన్న సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు ఇటీవలే రాజీనామా చేశారు. అలాగే.. ఉప రాష్ట్రపతిగా వెళ్లిపోవడంతో వెంకయ్యనాయుడు కూడా కేంద్ర‌మంత్రి పదవి నుంచి తప్పుకొన్నారు. దీంతో.. ఏపీ బీజేపీ నేతలకు కేంద్రంలో మంత్రి పదవులు దక్కడం ఖాయమని ప్రచారం కొన్నాళ్లగా జరుగుతోంది. ఇప్పుడు హరిబాబు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం కూడా వ్యూహాత్మకమే అని, హరిబాబుకు కేంద్రమంత్రి పదవి కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. పారీకి విశ్వసనీయమైన సేవలందించినందుకుగానూ హరిబాబు కేంద్రంలో బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర పార్టీ నాయకులంతా ఇటీవల అధిష్ఠానాన్ని కోరారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో హరిబాబుకు కేంద్రంలో సహాయమంత్రిగా చాన్స్‌ ఇస్తారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే పార్టీ సీనియ‌ర్ నేత‌, ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు ఎంపికైన జీవీఎల్ న‌ర‌సింహారావుకు ఈ ప‌ద‌వికి అడ్డుప‌డ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

బీజేపీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఏపీకి చెందిన నేత‌ల్లో ఒక‌రికి కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం ఖాయ‌మేన‌ని తెలుస్తోంది. అయితే హ‌రిబాబు కంటే న‌ర‌సింహారావుకే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. పార్టీ త‌ర‌ఫున గ‌ళం బ‌లంగా వినిపించ‌డం, టీడీపీని ఎదుర్కోవ‌డం అనే కోణంలో ఆయ‌న‌కు చాన్స్ ద‌క్క‌వ‌చ్చ‌ని చెప్తున్నారు. ఇదే జ‌రిగితే హ‌రిబాబుకు పార్టీ ప‌ద‌వితోనే స‌రిపుచ్చుతార‌ని వివ‌రిస్తున్నారు. అయితే, ఏపీ వాసి అయిన‌ప్ప‌టికీ...వేరే రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌యినందున ఆ ప‌దవి ఇవ్వ‌క‌పోవ‌చ్చున‌ని...హ‌రిబాబుకే చాన్స్ ఉంటుందంటున్నారు. ఈ నెలాఖ‌రుక‌ల్లా ఈ విష‌యంలో ఓ క్లారిటీ వ‌స్తుంద‌ని వివ‌రిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English