సీఎంపై ఫేస్‌బుక్‌లో పోస్ట్‌..వ్య‌క్తి అరెస్ట్‌ !

సీఎంపై ఫేస్‌బుక్‌లో పోస్ట్‌..వ్య‌క్తి అరెస్ట్‌ !

గోవా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ప్యాంక్రియాస్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్నారు. అయితే ఓ వ్య‌క్తి సీఎం పారికర్ ఆరోగ్యం విష‌యంలో సోష‌ల్ మీడియాలో అవాస్త‌వం ప్ర‌చారం చేశారు. ‘అమెరికాలో క్లోమ గ్రంధి సంబంధిత చికిత్స పొందుతున్న పారికర్‌ ఆరోగ్యం క్షీణించింది. ఇక ఆయన మనకు లేరు’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. దీనిపై ఫిర్యాదులు అంద‌డంతో వాస్కో ప‌ట్ట‌ణానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండ‌గా...పారిక‌ర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని రెండు రోజుల క్రితమే ఆ రాష్ట్ర బీజేపీ శాఖ వెల్లడించింది. అయితే డాక్టర్ల ఆదేశం తర్వాతే ఆయన స్వదేశానికి తిరిగివస్తారన్నారు.

ఇదిలాఉండ‌గా...గోవా సీఎం ఆరోగ్యంపై రాజ‌కీయ దుమారం మొద‌లైంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి15వ తేదీన ఆయన ముంబై హాస్పటల్‌లో చేరారు. ముంబైలోని లీలావతి హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కొన్ని గంటల్లోనే ఆయన పనాజీ చేరుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన అనంత‌రం కొన్ని రోజుల‌కు ఆయ‌నకు ఆరోగ్య స‌మ‌స్య‌లు మ‌ళ్లీ ఎదుర‌య్యాయి, దీంతో మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లారు. అయితే ఆయ‌న ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ ఇవ్వడంలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్య‌మంత్రికి సంబంధించిన కీల‌క స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కు ఎందుకు తెలియ‌జెప్ప‌డం లేదంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అయితే దీన్ని బీజేపీ నేత‌లు ఖండిస్తున్నారు. కానీ సీఎంవో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తుందని బీజేపీ నేతలు చెప్పారు.

మ‌రోవైపు పారిక‌ర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లే ముందు ఆయ‌న త‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల్లో ఎవ‌రికీ బాధ్యత‌లు అప్ప‌గించ‌లేదు. కేవ‌లం ముగ్గురు బ్యూరోక్రాట్ల‌కు ప‌రిపాల‌న బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో వారే ఆయా కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నారు. మ‌నోహ‌ర్ పారిక‌ర్ వ‌ద్ద దాదాపు 20కి పైగా ముఖ్య‌మైన శాఖ‌లు ఉండ‌టం విశేషం. కీల‌కమైన హోం, ఆర్థికం, జీఏడీ, మైనింగ్ వంటి ప్ర‌ధాన శాఖ‌లు ఆయ‌న చేతిలో ఉన్నాయి.తాజాగా అమెరికాలో ఆస్ప‌త్రిలో ఉన్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ త‌న నిర్ణ‌యాల‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా తీసుకుంటామ‌ని తెలియ‌జెప్పిన‌ట్లు స‌మాచారం. దీనిపై కూడా కాంగ్రెస్ విమ‌ర్శ‌లు చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English