బాబే వెళ్లిపోయాడు..టార్గెట్ చేస్తామంటున్న అమిత్‌షా

బాబే వెళ్లిపోయాడు..టార్గెట్ చేస్తామంటున్న అమిత్‌షా

టీడీపీ-బీజేపీ దోస్తీకి ఫుల్‌స్టాప్ ప‌డటం...రెండు పార్టీలు ఒక‌రిపై మ‌రొక‌రు విరుచుకుప‌డుతుండ‌టం తెలిసిన సంగ‌తే. ఏపీకి క‌మ‌ళ‌నాథుల ద్రోహం చేశార‌ని బాబు అంటుంటే....అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చామ‌ని..పైగా ఇచ్చిన‌వాటికి లెక్క‌లు కూడా చంద్ర‌బాబు పార్టీ చెప్ప‌లేద‌ని బీజేపీ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. ఇలా వాదోప‌వాదాలు జ‌రుగుతున్న ప‌ర్వంలో తాజాగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఆస‌క్తిక‌ర‌మై వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో ఏర్పాటు చేసిన ఇష్టాగోష్టిలో అనేకాంశాలపై సుదీర్ఘంగా అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. తాము తెలుగుదేశం పార్టీని దూరం చేసుకోవాలని అనుకోలేదని, టీడీపీ నిర్ణయాన్ని ఊహించలేకపోయామని వ్యాఖ్యానించారు.

2014 నుంచి త‌మ పొత్తు కొన‌సాగుతోంద‌ని..హ‌ఠాత్తుగా చంద్రబాబు నాయుడే తనంతట తానుగా ఎన్డీఏను వీడిపోయారని భారతీయ జనతా పార్టీ అధినేత అమిత్‌ షా అన్నారు. అయితే టీడీపీ ప్ర‌చారం వ‌ల్ల ఏపీలోని ప్రతి ఒక్కరూ బీజేపీని, అమిత్‌ షాను విలన్‌గా చూస్తున్నారు కదా అన్న విలేకరుల ప్రశ్నకు నవ్వుతూ.. బాలీవుడ్‌ సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో విశేష ఆదరణ కల్గిన ప్రాణ్‌లా అయ్యానన్నమాట అని బదులిచ్చారు. ఏపీలో బ‌లోపేతానికి మీరు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారా అంటే...` బీజేపీ బ‌ల‌ప‌డాల‌న్న టార్గెట్‌లో వివిధ రాష్ర్టాలు ఉన్నాయి. అందులో స‌హజంగానే, మిగ‌తా రాష్ట్రాల వ‌లే ఏపీ కూడా ఉంటుంది` అని అమిత్ షా తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు రాజీనామాపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. కొత్త అధ్యక్షుణ్ణి నియమించాల్సి ఉన్నందున ఆయన రాజీనామా చేశారు అని ముక్తసరిగా అన్నారు. మరి కొత్త అధ్యక్షుడు ఎవరంటే.. అది నేనిప్పుడే చెప్పను, త్వరలో మీకే తెలుస్తుందని అమిత్ షా త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు.

కాగా, మ‌క్కా మ‌సీదు బాంబు పేలుళ్ల‌ తీర్పుపై అమిత్ షా ఆస‌క్తిక‌రంగా స్పందించారు. హిందువులను టెర్రరిస్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వేలాది సంవత్సరాలుగా హిందువులు సంయమనం,సహనం కలిగినవారని, ఏనాడూ విదేశాల మీదకు దండయాత్ర చేసిన చరిత్ర హిందువులకు లేదని ఉద్వేగంతో అన్నారు. కత్తులు, తల్వార్లతో హిందూ ధర్మ ప్రచారం ఎప్పుడూ జరగలేదని కూడా ఆయనన్నారు. అయినా సరే ఇప్పుడు హిందువులను టెర్రరిస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, ఆ క్రమంలోనే అసీమానంద్‌ పేరు తెరమీదకు తెచ్చారని అన్నారు. అసలు అసీమానంద్‌ ఎవరో ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు. అత్యంత ధనిక కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, భిక్షాటన చేసుకునే సాధారణ సాధువుగా జీవిస్తున్న అసీమానంద్‌ చేసిన తప్పేంటని అమిత్‌ షా నిలదీశారు. ప్రలోభాలతో అమాయక ప్రజానీకాన్ని బలవంతపు మతమార్పిళ్ల బారిన పడకుండా అడ్డుకోడమే అసీమానంద్‌ చేసిన తప్పయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఏమీ లేద‌ని, త‌మ పార్టీ తిరిగి అధికారంలో వ‌స్తుంద‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా ధీమా వ్య‌క్తం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు