కేసీఆర్ స్ఫూర్తితో తాను యాగం చేస్తానంటున్న బీజేపీ సీఎం

కేసీఆర్ స్ఫూర్తితో తాను యాగం చేస్తానంటున్న బీజేపీ సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత‌ కే చంద్రశేఖర్‌రావుకు అనూహ్య‌మైన తీపిక‌బురు ఇది. సిద్ధాంతాల ప‌రంగా ఆయన్ను విమర్శించే తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు అస్స‌లు మింగుడు ప‌డ‌ని అంశం. ఔను. ఎందుకంటే...సాక్షాత్తు బీజేపీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఆద‌ర్శ‌నంగా తీసుకున్నారు. ఆయ‌నే త‌న స్ఫూర్తి అని ప్ర‌క‌టించారు. పైగా ఇదంతా హిందుత్వ అంశంలో కావ‌డం అస‌లు ట్విస్ట్‌. ఇంతకీ ఆ సీఎం ఎవ‌రంటే ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్ దేవ్. ఆయ‌న్ను కేసీఆర్ ఫిదా చేసింది ఎలాగంటే...దాదాపు రెండేళ్ల కింద‌ట కేసీఆర్‌ నిర్వహించిన అయుత చండీయాగం.

కాస్త వివ‌రంగా చెప్పాలంటే.. బీసీ సంక్షేమ పథకాలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న త్రిపుర పర్యటనకు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త్రిపు ర సచివాలయంలో బిప్లవ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి త్రిపుర సీఎం ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వం పనిచేస్తున్న తీరును ఆయన అభినందించారు. ఇదే స‌మ‌యంలో కేసీఆర్ చేసిన అయుత చండీయాగం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. దీంతో అత్యంత శక్తిమంతమైనదని బిప్ల‌వ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ యాగం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఎప్పటికీ అధికారంలో ఉంటారని పేర్కొంటూ తాను కూడా త్రిపురలో అయుత చండీయాగం చేయనున్నట్టు తెలిపారు.

తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి మంత్రి జోగురామన్న త్రిపుర సీఎంకు వివరించగా, ఆయన అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. వెదురు పరిశ్రమపై తెలంగాణతో త్వరలోనే అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంటామని త్రిపుర సీఎం హామీ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు.ముఖ్యంగా హరితహారం చాలా గొప్ప పథకమని, 230 కోట్ల మొక్కలు నాటాలన్న ఆలోచన, ఆచరణ.. సీఎం కేసీఆర్ సంకల్పానికి నిదర్శనమని త్రిపుర సీఎం పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు