జగన్ ఫ్యామిలీ పాలిటిక్స్ @కడప

జగన్ ఫ్యామిలీ పాలిటిక్స్ @కడప

రాజకీయాలకు వారసత్వాలకు ఉన్న సంబంధం అంతాఇంతా కాదు.. జాతీయ పార్టీ కాంగ్రెస్ నుంచి రాష్ట్రంలోని టీడీపీ వరకు అన్ని పార్టీల్లోనూ ఉన్నదే ఇది. దేశంలా ఒకటీఅరా పార్టీలు తప్ప మిగతా అన్నిటిదీ అదే రూటు. వైసీపీ కూడా ఇప్పుడు వారసత్వ రాజకీయాలకు పరాకాష్ఠగా మారడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడప మొత్తం ఆ కుటుంబానికి చెందినవారే పోటీ చేయనున్నారని సమాచారం. కడపలోని రెండు రిజర్వ్‌డ్ సీట్లు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలకు జగన్ కుటుంబీకులు, సమీప బంధువులకు రిజర్వ్ అయిపోయాయట.

గత ఎన్నికల్లోనే అధికారం ఆశించినా అనుకున్నది జరక్కపోవడంతో అర్రులు చాస్తున్న వైసీపీ నేతలు ఈసారి భారీ ఆశలు పెట్టుకున్నారు.  ఈ క్రమంలో జగన్ కుటుంబీకులు, సమీప బంధువులు అంతా ఈసారి కడపలో తమ జెండా ఎగరేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అందులో భాగంగా ఇప్పటికే జగన్‌ను ఒప్పించి ఆయన జాబితాలో చోటు సంపాదించారట.

ఇంతకీ జగన్ అండ్ కో కడపలో ఎవరెక్కడ పోటీ చేస్తారన్నది ఆ పార్టీ నుంచి వినిపిస్తోంది. కడప పార్లమెంటు స్థానానికి షర్మిల, పులివెందులలో జగన్మోహన్ రెడ్డి, కమలాపురంలో ఆయన మేనమామ రవీంధ్రనాథ్ రెడ్డి, కడప టౌన్..  అవినాష్ రెడ్డి, రాజంపేట.. వైఎస్ వివేకానందరెడ్డి, జమ్మలమడుగు నుంచి విజయమ్మ , మైదుకూరు నుంచి వై.ఎస్.వినీత్ రెడ్డి , రాయచోటిలో ద్వారకానాథ్ రెడ్డి , ప్రొద్దుటూరు నుంచి వైఎస్ మనోహర్ రెడ్డి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇక మిగిలినవి బద్వేలు, రైల్వేకోడూరు రిజర్వుడు నియోజకవర్గాలు మాత్రమే.

అయితే.. ఆ రెండు చోట్లా వైఎస్ కుటుంబ వీరవిధేయులే పోటీ చేస్తారట. ఇకపోతే బంధువుల కోసం రాయచోటి ఎమ్మెల్యే, చిన్ననాటి స్నేహితుడైన శ్రీకాంత్ రెడ్డిని ఖాళీ చేయిస్తున్నట్లు టాక్. మరోవైపు కడప ఎంపీ స్థానం చెల్లెలు షర్మిలకు ఇచ్చేందకు చిన్నాన్న కుమారుడు, ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డిని కడప టౌన్‌కి మార్చుతున్నారట. మొత్తానికి రాజశేఖరరెడ్డికి వారసుడిగా వచ్చిన జగన్ ఇప్పుడు బంధువర్గం మొత్తానికీ కడపను రాసిచ్చేయడానికి రెడీ అవుతున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు