ఘోర విమాన ప్ర‌మాదం.. 257 మంది సైనికులు మృతి

ఘోర విమాన ప్ర‌మాదం.. 257 మంది సైనికులు మృతి

ఘోర విమాన ప్ర‌మాదం అల్జీరియాలో చోటు చేసుకుంది. ఈ ఘోర ప్ర‌మాదంలో 257 మంది సైనికులు మృతి చెందారు. దేశ రాజ‌ధాని అల్జీర్స్ కు స‌మీపంలో సైనిక విమానం కూలిపోవ‌టంతో వంద‌లాది మంది సైనికులు మృతి చెందారు. భౌఫారిక్ వైమానిక స్థావ‌రం నుంచి టేకాఫ్ అయిన వెంట‌నే ఈ విమానం ప్ర‌మాదానికి లోనైన‌ట్లు చెబుతున్నారు.

విమానాశ్ర‌యం చుట్టూ ఉన్న నిర్మానుష్య‌మైన పంట‌పొలాల్లో విమానం కూలిపోయింది. ద‌క్షిణ అల్జీరియాలోని టిండౌఫ్ కు సైనికుల్ని త‌ర‌లిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని చెబుతున్నారు. ఈ విమానానికి 120 మందిని మాత్ర‌మే త‌ర‌లించే సామ‌ర్థ్యం ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌మాదం నుంచి ఎవ‌రైనా సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారా? అన్న స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు.

ఈ ప్ర‌మాదానికి కార‌ణం ఏమిట‌న్న‌ది తేల్చాల‌ని ర‌క్ష‌ణ‌శాఖ స‌హాయ‌మంత్రి జ‌న‌ర‌ల్ అహ్మ‌ద్ గైడ్ ఆదేశించారు. ప్ర‌మాదం జ‌రిగిన ఘ‌ట‌నాస్థ‌లాన్ని సంద‌ర్శించిన ఆయ‌న ప్ర‌మాదానికి కార‌ణాలు ఏమిటో తేల్చాల‌న్నారు. భారీ విమాన ప్ర‌మాదాలు అల్జీరియాలో త‌ర‌చూ చోటు చేసుకుంటూ ఉంటాయి. 2014 ఫిబ్ర‌వ‌రిలోనూ సైనిక విమానం కూలి 77 మంది మ‌ర‌ణించ‌గా.. అదే ఏడాది జులైలో ఒక పౌర విమానం ప్ర‌మాదానికి గురై 116 మంది ప్రాణాలు కోల్పోయారు.  తాజా ప్ర‌మాదం అంత‌కు రెట్టింపు అన్న‌ట్లు భారీ ప్రాణ‌నష్టం వాటిల్లింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు