కేటీఆర్‌కు కొత్త ప‌ద‌వి..ఈ చర్చ కాస్త డిఫ‌రెంట్‌

కేటీఆర్‌కు కొత్త ప‌ద‌వి..ఈ చర్చ కాస్త డిఫ‌రెంట్‌

తెలంగాణలో అధికార‌ప‌క్ష‌మైన టీఆర్ఎస్ పార్టీని ప్ర‌స్తావిస్తూ మ‌రో కొత్త చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే టీఆర్‌ఎస్‌ పార్టీ పగ్గాలను మంత్రి కె తారకరామారావుకు అప్పగించ‌డం. ఇప్పుడెందుకు ఈ అంశం ప్ర‌చారంలోకి వ‌స్తోందంటే...టీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్ల‌ను మొద‌లుపెట్ట‌డం. ఈనెల 27న మేడ్చల్‌లో జరిగే పార్టీ ప్లీనరీకి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు పార్టీ వివ‌రించిన నేప‌థ్యంలో ఈ చ‌ర్చ జ‌రుగుతోంది.  పార్టీ ప్లీనరీలో ఈ మేరకు కొత్త బాధ్యతల్ని అప్పగించనున్న‌ట్లు టీఆర్ఎస్ వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

గత ఏడాది జ‌రిగి ప్లీనరీలోనే పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేటీఆర్‌కు కట్టబెడతారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో సీఎంకేసీఆర్‌ మేనల్లుడు, పార్టీలో రెండో స్థానంలో ఉన్న హరీశ్‌రావును పక్కన పెడుతున్నారని నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తం కావడంతో తాత్కాలికంగా ఆ పదవిని ప్రకటించలేదు. ఆ తర్వాతి నుంచే మంత్రి కేటీఆర్‌ పార్టీపై పూర్తి పట్టు సాధించేందుకు అన్ని నియోజకవర్గాల్లోనూ విస్త్రుత పర్యటనలు చేశారు. ప్రతి జిల్లాలోనూ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో భాగస్వామి అయ్యారు. అదే సమయంలో మంత్రి హరీశ్‌రావు తన శాఖాబాధ్యతలు, నియోజకవర్గానికే పరిమితం అయ్యాయి. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి పోటీ నుంచి హరీశ్‌రావును తప్పుకొమ్మనమని ఇప్పటికే మంత్రి హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్‌ చెప్పేశారని ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ తీసుకునే ఏ నిర్ణయమైనా తనకు శిరోధార్యమేనని మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే అనేకసార్లు బహిరంగంగానే చెప్తూ వస్తున్నారు.

ఇదిలాఉండ‌గా మ‌రో కొత్త చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించడంతో మంత్రి కేటీఆర్‌కు అధికారం కట్టబెట్టడం ఇక లాంఛనమేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో ఆరంగేట్రంలో భాగంగా మేనల్లుడు హరీశ్‌రావును కూడా తనవెంట తీసుకెళ్తారనే మరో వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల మంత్రి కేటీఆర్‌ రాజకీయ భవిష్యత్‌కు ఎలాంటి అవాంతరాలు ఉండబోవని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించిన నేపధ్యంలో పార్టీపై పట్టు సాధించేందుకు మంత్రి కేటీఆర్‌ కూడా క్షేత్రస్థాయిలో ప్రగతియాత్రల పేరుతో హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాలు చుట్టి వస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తే...ఆయనే ముఖ్యమంత్రి కూడా అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English