ఐపీఎల్‌పై ర‌జ‌నీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఐపీఎల్‌పై ర‌జ‌నీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

త్వ‌ర‌లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న త‌మిళ‌సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ నోటి నుంచి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. ఐపీఎల్ క్రికెట్ పోటీల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఓ వైపు రాష్ట్ర ప్ర‌జ‌లు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ప‌డుతూ.. కావేరీ న‌దీ జ‌లాల కోసం నిర‌స‌న‌లు తెలుపుతుంటే.. ఇలాంటివేళ ఐపీఎల్ క్రికెట్ పోటీలు ఎందుకంటూ ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కావేరీ న‌దీ జలాల బోర్డును ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తున్న వేళ‌.. క్రికెట్ పోటీలు జ‌రుగుతూ ఉండ‌టం త‌న‌కు చిరాకు తెప్పిస్తోంద‌న్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఐపీఎల్ పోటీలు ఇబ్బందిగా మారాయ‌న్నారు.  ఐపీఎల్ లో ఆడే క్రీడాకారులు ప్ర‌జ‌లు చేస్తున్న నిర‌స‌న‌ల‌కు మ‌ద్ద‌తుగా క‌నీసం న‌ల్ల‌బ్యాడ్జీల‌ను ధ‌రించి ఆడాల‌న్న విన‌తిని చేశారు.
త్వ‌ర‌లోనే రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేయ‌టం ద్వారా పూర్తిస్థాయి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న ర‌జ‌నీకాంత్ ఇచ్చిన పిలుపు ఐపీఎల్ క్రీడాకారులుఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌కుండానే ఐపీఎల్ మ్యాచ్ కు ఎఫెక్ట్ అయ్యేలా ర‌జ‌నీ మాట‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు. తాజాగా ఆయ‌న మాట‌లు ప‌క్కా రాజ‌కీయ నేత‌గా ఉన్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే కావేరీ జ‌లాల కోసం సాగుతున్న నిర‌స‌న‌ల్లో కోలీవుడ్ న‌టీన‌టులు ధ‌నుష్‌.. విజ‌య్‌.. సూర్య‌.. స‌త్య‌రాజ్.. శివ‌కుమార్‌.. నాజ‌ర్.. విశాల్‌.. కార్తీ.. శివ‌కార్తీకేయ‌న్ త‌దిత‌రులు పాల్గొంటున్నారు. వీరు నిర్వ‌హించే నిర‌స‌న శిబిరానికి ర‌జ‌నీ.. క‌మ‌ల్ లాంటి వాళ్లు వ‌చ్చి మ‌ద్ద‌తు ప‌లుకుతార‌ని చెబుతున్నారు. చూస్తుంటే కావేరీ నిర‌స‌న‌లు రానున్న రోజుల్లో మ‌రింత ముద‌ర‌టం ఖాయమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు