మోడీతో వార్ కి రెఢీ అవుతున్న బాబు!

మోడీతో వార్ కి రెఢీ అవుతున్న బాబు!

థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. ట్వంటీ ఇయ‌ర్స్ ఇక్క‌డ‌. లాంటి మాట‌లు విన్నంత‌నే న‌వ్వుకుంటాం కానీ.. చాలా సంద‌ర్భాల్లో అనుభ‌వం ఎంతో కొంత అక్క‌ర‌కు వ‌స్తుంది. ఆ విష‌యంలో మ‌రో మాట‌కు తావు లేదు. ఎవ‌రెన్ని వంక‌లు పెట్టినా.. మ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్లానింగ్ ఎంత ప‌క్కాగా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఏదైనా అంశంపై క‌మిట్ అయితే.. ఆ విష‌యం అంతు చూసే వ‌ర‌కూ వెన‌క్కి త‌గ్గ‌ని మొండిత‌నం చంద్ర‌బాబులో క‌నిపిస్తుంది.

ఇప్పుడున్న‌కాలంలో మ‌ర్యాద రాజ‌కీయాల‌కు బాబును చెప్ప‌క త‌ప్ప‌దు. తొంద‌ర‌ప‌డిపోవ‌టం.. త్వ‌ర‌గా స్థిమితం కోల్పోవ‌టం.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌టం కాకుండా.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌టంలో బాబుకున్న ట్రాక్ రికార్డును వంక పెట్ట‌టానికి వీల్లేదు.

ప్ర‌త్యేక హోదా సాధ‌న విష‌యంలో మోడీ స‌ర్కారుపై ఫైట్ కు సిద్ధ‌మైన బాబు.. మ‌రింత ముందుచూపుతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పాలి. మోడీ లాంటోడితో త‌ల‌ప‌డ‌టం అంటే అంత తేలికైన సంగ‌తి కాదు. అందులోకి పీక‌ల్లోతు క‌ష్టాలున్న రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తూ కేంద్రాన్ని ఢీ కొన‌టం అంటే సామాన్య‌మైన విష‌యం కాదు. అయిన‌ప్ప‌టికీ.. ఐదుకోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్లు పోరాడేందుకు సిద్ధ‌మైన బాబుకు.. మోడీ నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉంటాయ‌న్న అంశంపై పూర్తి క్లారిటీగా ఉన్నార‌ని చెప్పాలి.

మోడీకి చెక్ చెప్పేలా బాబు త‌న ప్ర‌య‌త్నాల్ని షురూ చేశారు. ముంద‌ర కాళ్ల బంధంగా ఆయ‌న మోడీ స‌ర్కారు వేసే ఎత్తుల్ని చిత్తు చేసే దిశ‌గా ఆయ‌న పావులు క‌దుపుతున్నారు. ఇందుకు త‌గ్గ‌ట్లే బాబు తాజా వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెప్పాలి. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా ఏపీపై మోడీ ఫోక‌స్ ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అదే విష‌యాన్ని చంద్ర‌బాబు చెప్ప‌టం ద్వారా ప్ర‌త్య‌ర్థి దూకుడుకు క‌ళ్లాలు వేసిన‌ట్లుగా చెప్పాలి.

నెల రోజుల్లో క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే బీజేపీ పెద్ద‌లు ఏపీకి వ‌స్తార‌ని.. త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌టం ఖాయ‌మ‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. త‌న‌తో త‌ల‌ప‌డేందుకు మోడీ స‌ర్కారు రెఢీ అయితే అందుకు త‌గిన కౌంట‌ర్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న ఓపెన్ గానే చెబుతున్నారు. మోడీతో త‌ల‌ప‌డేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని.. నైతికంగా చాలా బ‌లంగా ఉన్న రాష్ట్రంతో పెట్టుకుంటే వారికే న‌ష్ట‌మ‌ని రివ‌ర్స్ వార్నింగ్ ఇచ్చారు.

గ‌తంలో తానెన్నో పోరాటాలు చేశాన‌ని.. విజ‌యం సాధించే వ‌ర‌కూ రాజీ ప‌డేది లేద‌న్నారు. రాష్ట్రానికి నిధులు విడుద‌ల చేయ‌కుండా తొక్కిపెట్టార‌న్నారు. రాష్ట్రంతో ఆడుకోవాల‌నుకుంటున్న బీజేపీ నేత‌ల ఆట‌లు సాగ‌నివ్వ‌న‌ని.. వ‌చ్చే ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల్లో బీజేపీకి ఒక్క ఓటు కూడా ప‌డ‌దన‌టం గ‌మ‌నార్హం.  జాతీయ స్థాయి నేత అమిత్ షా వాడిన ప‌దాలు.. ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ వాడ‌లేద‌ని నిప్పులు చెరిగిన బాబు.. కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో స్వ‌ర్ణం సాధించిన రాహుల్ ను చూసి ఢిల్లీ పెద్ద‌లు బాధ ప‌డి ఉండొచ్చ‌న్నారు. ఇక‌పై ప‌త‌కాల‌న్నీ సింధు.. శ్రీ‌కాంత్ లాంటి క్రీడాకారుల‌కు వ‌స్తాయ‌ని వ్యాఖ్యానించారు. చూస్తుంటే.. మోడీ అండ్ కోతో వార్ కు బాబు అస్త్ర‌శ‌స్త్రాల‌న్నింటిని సిద్ధం చేసుకున్న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు