ప్ర‌ధాని ఇంటిని ముట్ట‌డించిన టీడీపీ ఎంపీలు...అరెస్టు!

ప్ర‌ధాని ఇంటిని ముట్ట‌డించిన టీడీపీ ఎంపీలు...అరెస్టు!

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని, విభ‌జ‌న హామీలు అమ‌లు చేయాల‌ని టీడీపీ ఎంపీలు కొద్ది రోజులుగా పార్ల‌మెంటు లోప‌ల‌, వెలుప‌ల ఆందోళ‌న‌ల‌తో హోరెత్తిస్తోన్న సంగ‌తి తెలిసిందే. టీడీపీ ప్ర‌వేశ‌పెట్టిన  అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే పార్ల‌మెంటు స‌మావేశాలు ముగిసిపోవ‌డంతో టీడీపీ ఎంపీలంద‌రూ....ఢిల్లీలో త‌మ నిర‌స‌న గ‌ళాన్ని వినిపించేందుకు ప్ర‌ధాని మోదీ నివాసం ఎదుట ధ‌ర్నాకు దిగారు. అంతేకాకుండా, ప్ర‌ధాని ఇంటిని ముట్ట‌డించేందుకు ప్ర‌య‌త్నించారు.

అయితే, ఈ నిర‌స‌న‌ల గురించి ముందుస్తు స‌మాచారం అందుకున్న పోలీసులు టీడీపీ ఎంపీల‌ను అడ్డుకున్నారు. అది నిషేధిత ప్రాంత‌మ‌ని, ఇక్క‌డ ధ‌ర్నా చేప‌ట్ట‌కూడద‌ని వారించిన పోలీసులు...టీడీపీ ఎంపీల‌ను బ‌ల‌వంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అమానుషంగా లాగి ప‌డేశారు. ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ ఎంపీలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

ప్రధాని ఇంటిని ముట్టడించేందుకు ఎంపీలు జేసీ దివాక‌ర్ రెడ్డి, అశోక్ గజపతిరాజు, గల్లా జయదేవ్, సీఎం రమేష్, మురళీ మోహన్, రామ్మోహన్ నాయుడు తదితరులంతా ప్రధాని నివాసం వద్దకు చేరుకున్నారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు భారీగా అక్క‌డికి చేరుకొని బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్క‌డ ధ‌ర్నా చేయ‌కూడ‌ద‌ని చెప్పినా విన‌క‌పోవ‌డంతో...ఎంపీల‌ను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషనుకు తరలించారు. అరెస్టులతో తమను ఆపలేరని, ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సీఎం రమేష్ హెచ్చరించారు.

ఈ ఘ‌ట‌న‌పై సుజనా చౌదరి తీవ్రంగా మండిప‌డ్డారు. ప్రజా ప్రతినిధులని చూడకుండా ఎంపీల‌ను ఈడ్చుకెళ్లారని, మోదీ సర్కారు ఆదేశాలతోనే పోలీసులు ఇలా చేశార‌ని ఆరోపించారు. ఎంపీల‌ను త‌ర‌లించిన పోలీస్ స్టేష‌న్ కు తాను వెళుతున్నాన‌ని చెప్పారు. ఏపీకి న్యాయం జ‌రిగేవ‌ర‌కు  వెనక్కు తగ్గేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు