ఏపీకి పురంధేశ్వ‌రి చేసిన అన్యాయమే ఎక్కువ‌!

ఏపీకి పురంధేశ్వ‌రి చేసిన అన్యాయమే ఎక్కువ‌!

ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లు విష‌యంలో బీజేపీ స‌ర్కార్ వైఖ‌రిపై వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌లు మండిప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా, అర‌కొరా నిధులు విడుద‌ల చేస్తూ....న్యాయం చేశామ‌ని బీజేపీ డ‌ప్పుకొట్టుకుంటోంది. అయితే, ఒక్క ఏపీకే కాకుండా దేశంలోని ఏ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేయ‌ద‌ని ఆ పార్టీ నేత పురంధేశ్వ‌రి అన్నారు.

అంతేకాదు, 2014 ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేర్చి తీర‌తామ‌ని అన్నారు. ఏపీలో బీజేపీ బ‌ల‌ప‌డుతోంద‌ని, అందుకు ఆ పార్టీపై టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఏ పార్టీ ఎటువంటిదో ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌ని అన్నారు. ఏపీలో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోలేదని, హోదా కంటే ప్యాకేజీనే బెటర్ అని అభిప్రాయ‌ప‌డ్డారు.

అయితే, వాస్త‌వానికి ఏపీని అడ్డ‌దిడ్డంగా విభ‌జించి కాంగ్రెస్ ఎంత అన్యాయం చేసిందో....ప్ర‌స్తుతం బీజేపీ కూడా అంత‌కు మించి అన్యాయం చేసింద‌న్న అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏపీకి బీజేపీ గ‌తంలో న్యాయం చేయ‌లేద‌ని....భ‌విష్య‌త్తులో కూడా చేయ‌ద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంద‌ని ఏపీ ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దేశంలోని 29 రాష్ట్రాల‌లో 25 రాష్ట్రాల‌కు బీజేపీ తీర‌ని అన్యాయం చేసింద‌న్న భావ‌న‌లో ప్ర‌జ‌లున్నారు. ఆనాడు పార్ల‌మెంటు సాక్షిగా ఏపీకి ఐదేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని....త‌ర్వాత ప‌దేళ్లు...ఆ త‌ర్వాత 15 ఏళ్లు అని బీజేపీ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టింద‌ని జ‌నం అనుకుంటున్నారు. తీరా ఏరు దాటాక తెప్ప తగ‌లేసిన‌ట్లు ...ఇపుడు హోదా ఇవ్వ‌లేం...అంటూ కాక‌మ్మ‌క‌బుర్లు చెబుతోంద‌ని మండిప‌డుతున్నారు.

ఆ మాట‌కొస్తే....ఏపీకి బీజేపీక‌న్నా ఎక్కువ‌గా పురంధేశ్వ‌రి అన్యాయం చేసింద‌నే అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. ఆనాడు కాంగ్రెస్ లో ఉండి రాష్ట్ర విభ‌జ‌న‌ను అడ్డుకోలేద‌ని, ఈనాడు బీజేపీలో ఉండి హోదా కోసం గ‌ళం విప్ప‌డం లేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సొంత రాష్ట్రం క‌న్నా పార్టీ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మని భావిస్తోన్న పురంధేశ్వ‌రి నేడు ఏపీకి అన్యాయం జ‌ర‌గ‌లేదంటూ మాట్లాడ‌డం హాస్యాస్పద‌మంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు