ఈ దూకుడేంది సామీ.. టీడీపీ వాళ్ల‌కే ఆశ్చ‌ర్యం!

ఈ దూకుడేంది సామీ.. టీడీపీ వాళ్ల‌కే ఆశ్చ‌ర్యం!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు తెగువ తెలుగుదేశం పార్టీ శ్రేణుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఢిల్లీ వేదిక‌గా ప్ర‌ధాన‌మంత్రి మోడీకి షాకిచ్చేలా బాబు చేస్తున్న ప‌ర్య‌ట‌న‌లు, న‌రేంద్ర మోడీని ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను నెర‌వేర్చ‌ర‌ని తీరును ఆయ‌న వెల్ల‌డిస్తున్న తీరుతో పాటుగా తాజాగా మ‌రో అంశంతో టీడీపీ నాయ‌కులు బాబు దైర్యంపై చ‌ర్చించుకుంటున్నారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన సీఎం బుధవారం సాయంత్రం జాతీయ మీడియాతో మాట్లాడారు. ఇటు ఇష్టాగోష్టిగా అటు విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ బాబు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించారు.

గుజరాత్ అల్లర్ల తర్వాత మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని అందరికన్నా ముందు తానే డిమాండ్ చేశాన‌ని ఏపీ సిఎం చంద్రబాబు ఢిల్లీ వేధికగా వివ‌రించారు. ఒక‌వేళ ప్ర‌ధాని అదే విష‌యాన్ని మ‌న‌సులో పెట్టుకొని ఏపీకి అన్యాయం చేస్తున్నారా అని జ‌ర్న‌లిస్టులు ప్ర‌శ్నించగా...ఆ విష‌యం మీడియానే వెల్ల‌డించాల‌న్నారు. ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ నెల్లూరు, తిరుపతి సభలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన ప్రకటన వీడియోను, అమరావతి శంకుస్థాపన సభలో మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామని, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పిన వీడియో దృశ్యాలను మీడియాకు చూపించారు.

స్వయంగా ప్రధాని ప్రకటించిన హామీలే అమలుకు నోచుకోలేదని, వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేసి సమాచారం ఇవ్వకుండా వెనక్కి తీసుకున్నారన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టం జరిగిందని.., ఆ నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేయాలని కోరేందుకు 29 సార్లు ఢీల్లీకి వచ్చాని, ఇది 30 వ సారి రావడం అని చెప్పారు. కేంద్రం ఇప్పుడు కొత్తగా స్పెషల్‌ పర్పస్‌ వెహికల్ అంటోంద‌ని, కేంద్రం తీరు చూసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు విసుగెత్తిపోయారన్నారు.

కేంద్రం తీరు వల్ల ఐదు కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చంద్ర‌బాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని నీతి అయోగ్, కేంద్ర ప్రభుత్వం చెప్పాయని తెలిపారు. ఏపీకి ఎంతో ప్రధానమైన పోలవరం పనులు పూర్తి స్థాయిలో వేగవంతంగా జరుగుతున్నాయని... ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టుకు నిధులను సరిగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలవరంపై తాము ఖర్చు చేసిన రూ. 3 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలవరంలో జరుగుతున్న పనులను లైవ్ ద్వారా ఆయన చూపించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తన పరపతిని డ్యామేజ్ చేసేందుకు బీజేపీ,వైసీపీలు ప్రయత్నిస్తున్నాయని  ద్వజమెత్తారు. హస్తినా వేదికగా వైఎస్ఆర్‌సీపీ తీరును చంద్రబాబు మరోసారి తూర్పారపట్టారు. బీజేపీతో వైసీపీ లాలూచీ పడిందని విమర్శించారు. వైసీపీ అండ చూసుకొని కేంద్ర ప్రభుత్వం ఏపీని ఇబ్బంది పెడుతోందన్నారు. రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చుంటే పోరాటం ఎవరు చేస్తారని బాబు ప్రశ్నించారు. వైసీపీలా టీడీపీ లోపాయికారి పార్టీ కాదని తాము కేంద్రంపై పోరాడుతున్నామని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు