ఎల్లుండి నుంచి ఏపీలో జ‌న‌సేనాని పాద‌యాత్ర‌!

ఎల్లుండి నుంచి ఏపీలో జ‌న‌సేనాని పాద‌యాత్ర‌!

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తో వామపక్ష పార్టీల నేతలు బుధవారం విజ‌య‌వాడ‌లో భేటీ అయ్యారు. విజయవాడలోని జనసేన కార్యాలయంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు...ప‌వ‌న్ తో భేటీ అయ్యారు. భార‌త్ వంటి ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై ఇన్ని రోజులుగా చర్చ చేపట్టకపోవడం దారుణమని ప‌వ‌న్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం బాధ్యతలను విస్మరించిందని, స‌భ స‌జావుగా జ‌రిపించ‌డంలో విఫ‌ల‌మైంద‌ని మండిప‌డ్డారు. ఈ నెల 6న ఏపీలో పాదయాత్ర చేస్తామని, జాతీయ రహదారుల్లో, పలు ముఖ్య కూడళ్లలో స‌భలు నిర్వహిస్తామని పవన్ చెప్పారు. శాంతియుత పద్ధతిలో నిరసన కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని,  జనసేన, సీపీఎం, సీపీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ నిర‌స‌న‌ల్లో పాల్గొంటారని చెప్పారు. ఢిల్లీకి తెలుగువారి సెగ త‌గిలేలా త‌మ నిర‌స‌న‌లుంటాయ‌న్నారు.

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుండా టీడీపీ, వైసీపీలు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నాయ‌న్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విష‌యంలో కేంద్రం వైఖ‌రిని ప్ర‌శ్నించాల‌న్నారు. ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్ట సవరణ చేస్తోన్న నేపథ్యంలో నిర్వహించిన బంద్‌లో అంతమంది మృతి చెందడం, గాయాలపాలవడం బాధనిపించిందని, ఈ చర్యను తాము ఖండిస్తున్నామని అన్నారు. కాగా, త‌న భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై వామ‌ప‌క్ష నేత‌ల‌తో ప‌వ‌న్ చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.

ఆమరణదీక్ష చేపట్టే అంశంపై , జేఎఫ్‌సీ నివేదిక, ఢిల్లీలో పరిణామాలపై ప‌వ‌న్ చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. గత నెలలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షకైనా సిద్ధమ‌ని పవన్ ప్రకటించిన నేప‌థ్యంలో....మే నెల తర్వాత ప‌వ‌న్  ఆమరణ దీక్ష చేప‌ట్ట‌బోతున్నార‌ని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు