ఆంధ్ర‌జ్యోతి మీద బీజేపీ అక్క‌సు ప్ర‌ద‌ర్శించిందా?

ఆంధ్ర‌జ్యోతి మీద బీజేపీ అక్క‌సు ప్ర‌ద‌ర్శించిందా?

ఆంధ్ర‌జ్యోతి ప్ర‌ధాన కార్యాల‌యం ద‌గ్గ‌ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఆంధ్ర‌జ్యోతి డౌన్ డౌన్.. రాధాకృష్ణ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప‌లువురు నినాదాలు చేశారు. ఆంధ్ర‌జ్యోతి ఆఫీసు ముట్ట‌డికి ప్ర‌య‌త్నించారు. బీజేపీ నేత‌ల‌కు అంత‌లా కోపం వ‌చ్చే ప‌ని ఆంధ్ర‌జ్యోతి ఏం చేసింది?  ఎందుకంత ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెతికితే కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

గ‌డిచిన మూడు రోజులుగా ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక మొయిన్ ఎడిష‌న్లో ప్ర‌ధాని మోడీ వ్య‌క్తిత్వాన్ని విశ్లేషిస్తూ భారీ క‌థ‌నాలు ప‌బ్లిష్ అవుతున్నాయి. ఆయ‌న వ్య‌క్తిత్వం తీరును విశ్లేషిస్తూ ప్ర‌ముఖ వ్య‌క్తిత్వ వికాస నిపుణుడు సి. న‌ర‌సింహ‌రావు రాసిన విశ్లేష‌ణ‌లు ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి వ‌రుస‌గా ప్ర‌చురిత‌మ‌వుతున్నాయి.

ఇటీవ‌ల కాలంలో ముఖ్య‌నేత‌ల్ని భ‌జ‌న చేయ‌టం.. లేదంటే వారి పాల‌న మా గొప్ప అంటూ కీర్తించ‌ట‌మే కానీ..  తిట్టేసి.. విమ‌ర్శించేసేలా రాయ‌టం పత్రిక‌లు మానేసి చాలాకాల‌మే అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల అధికార‌ప‌క్షాల మీద‌నేకాదు.. కేంద్రంపైనా చాలా మీడియా సంస్థ‌లు చూసి చూడ‌న‌ట్లే వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఇందుకు తెలుగులోని ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లు సైతం అతీతం కాదు.

ఇలాంటి వేళ‌.. జ్యోతిలో వ‌రుస‌గా ప్ర‌చురిత‌మ‌వుతున్న క‌థ‌నాలు మోడీని విప‌రీతంగా అభిమానించే వారికి మంట పుట్టిస్తున్నాయి. మోడీని ఇంద్రుడిగా.. చంద్రుడిగా పోల్చి చూసుకోవ‌టం.. గొప్ప‌లు చెప్పుకోవ‌టం అల‌వాటుగా మారిన రోజుల్లో అందుకు భిన్నంగా ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని సునిశిత విశ్లేష‌ణ‌లో ఇస్తున్న‌క‌థ‌నాలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. మోడీలోని భిన్న పార్శాల్ని స‌మ‌ర్థంగా ఎత్తి చూప‌ట‌మే కాదు.. ఆయ‌న ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా క‌థ‌నాలు ఉన్నాయి.

దీంతో.. ఈ క‌థ‌నాల‌పై బీజేపీ గుర్రుగా ఉంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తాజాగా ఆంధ్ర‌జ్యోతి ద‌గ్గ‌ర ధ‌ర్నా చేసే ప్ర‌య‌త్నం చేసిన వారు కానీ.. నిర‌స‌న వ్య‌క్తం చేసివారిలో ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. అంత‌దాకా ఎందుకు చివ‌ర‌కు కార్పొరేట‌ర్లు కూడా నిర‌స‌న చేసే వారిలో లేరు. మ‌రి.. ఆంధ్ర‌జ్యోతి ప్ర‌ధాన‌కార్యాల‌యం ద‌గ్గ‌ర నిర‌స‌న చేసిన వారు ఎవ‌రు? అంటే.. బీజేపీ యువ‌మోర్చా విభాగానికి చెందిన వారని చెబుతున్నారు.

మోడీ మీద ప్రేమ ఉంటే.. అంద‌రికి జ్యోతి క‌థ‌నాలు కోపం క‌లిగించాలి కానీ.. కొంద‌రికి మాత్ర‌మే నొప్పిగా అనిపించ‌టం.. నిర‌స‌న వ్య‌క్తం చేయ‌టం చూస్తే.. పెద్దోళ్లంతా ఆబ్లిగేష‌న్ పేరుతో త‌ప్పించుకొని.. కిందిస్థాయి కార్య‌క‌ర్త‌ల్ని జ్యోతి ఆఫీసు మీద‌కు పంపిన‌ట్లుగా తెలుస్తోంది. మోడీపై క‌థ‌నాల్ని వెంట‌నే నిలిపివేయాల‌ని కోర‌ట‌మే కాదు.. ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌ను.. ఆ సంస్థ ఎండీ రాధాకృష్ణ‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాల‌యాన్ని ముట్ట‌డించే ప్ర‌య‌త్నం చేశారు. బీజేపీ కార్య‌క‌ర్త‌ల నిర‌స‌న కార్య‌క్ర‌మం మీద ముందే స‌మాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున భ‌ద్ర‌త క‌ల్పించారు. జ్యోతి ఆఫీసుకువెళ్లే ప్ర‌ధాన రోడ్ల‌ను మూసివేశారు. బారికేడ్లు అడ్డుగా పెట్టి నిర‌స‌న‌కారుల్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు.

అయిన‌ప్ప‌టికీ మెరుపులా జ్యోతి ఆఫీసు ద‌గ్గ‌ర‌కు దూసుకొచ్చిన బీజేపీ కార్య‌క‌ర్త‌లతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నిర‌స‌న చేసే వారిని పోలీసులు అడ్డుకోవ‌టంపై నిర‌స‌న‌కారులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ సంద‌ర్భంగా నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టేందుకు వ‌చ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. అనంత‌రం బెయిల్ మీద విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పోలీసు వ‌ర్గాలు తెలిపాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు