ఆ పుకార్ల‌ను ఖండించిన ల‌క్ష్మీనారాయ‌ణ!

ఆ పుకార్ల‌ను ఖండించిన ల‌క్ష్మీనారాయ‌ణ!

కొద్ది రోజుల క్రితం తన ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్ర‌క‌టించ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన అనంత‌రం ల‌క్ష్మీనారాయ‌ణ...వైసీపీ లేదా జ‌న‌సేనలో చేర‌బోతున్నార‌ని, అందుకే రాజీనామా చేశార‌ని ర‌క‌ర‌కాలు ఊహాగానాలు వ‌చ్చాయి. ల‌క్ష్మీనారాయ‌ణ జ‌న‌సేన‌లో కి వ‌స్తే స్వాగ‌తిస్తాన‌ని జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్ అన్నారు.

ఈ నేప‌థ్యంలో ల‌క్ష్మీనారాయ‌ణ త‌న‌పై వ‌స్తున్న ఊహాగానాల‌కు తెర‌దించారు. త‌న‌ను ఏ రాజ‌కీయ పార్టీ సంప్రదించ‌లేద‌ని, త్వ‌ర‌లోనే త‌న భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని అన్నారు. త‌న‌పై మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని అన్నారు. ఓ ఇంట‌ర్వ్యూ లో పాల్గొన్న ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

త‌న భవిష్యత్ కార్య‌చ‌ర‌ణ‌పై ఏ మీడియాతోను చ‌ర్చించ‌లేద‌ని ఆయ‌న స్పష్టం చేశారు. త‌న రాజీనామా ఆమోదం పొందాక భవిష్యత్ కార్య‌చరణను స్వ‌యంగా ప్ర‌క‌టిస్తాన‌ని అన్నారు. వరుస సెలవుల వల్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తన రాజీనామాపై దృష్టి సారించలేక పోతున్నారని, అందుకే త‌న రాజీనామా ఆమోదం ఆల‌స్యం అవుతోంద‌ని తెలిపారు.

జనసేన పార్టీలోకి పవన్ కల్యాణ్ తనను స్వాగతిస్తానని చెప్పినట్లు పేపర్లో చదివానని అన్నారు. అయితే, తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదన్నారు. రాజీనామా ఆమోదం పొందాక...రాజీనామాకు గ‌ల కార‌ణాలు వెల్ల‌డిస్తాన‌న్నారు. రాజకీయ ప్ర‌వేశంపై మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం దాట‌వేశారు. త్వ‌ర‌లోనే అన్ని విష‌యాలు, తన సిద్ధాంతాలు ప్రకటిస్తానని అప్పటివరకు ఓపిక పట్టాలని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు