హెచ్‌1బీ మొద‌లైందిఃతేడా వ‌స్తే అంతే

హెచ్‌1బీ మొద‌లైందిఃతేడా వ‌స్తే అంతే

సుదీర్ఘ‌కాలంగా ఎదురుచూస్తున్న అమెరికా హెచ్ 1బీ వీసాల దరఖాస్తుల ప్రక్రియ ఎట్ట‌కేల‌కు నేటి నుంచి ప్రారంభం కానుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తరువాత వీసా నిబంధనలను కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల్లో చిన్నపాటి తప్పులు దొర్లినా వాటిని తిరస్కరించే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  వీసాదారులు గతంలో కంటే ఎక్కువ నిబంధనలను ఈసారి ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీసాల జారీ విషయంలో చిన్న పొరపాటు కూడా దొర్లకుండా ఉండేందుకు కఠినమైన చర్యలను యూఎస్‌సీఐఎస్‌ చేపట్టింది.

భారత్‌కు చెందిన ఉన్నతస్థాయి సాంకేతిక నిపుణులు వర్క్ వీసాల తరువాత హెచ్ 1బీ వీసాలనే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఏటా 65,000 మందికి మాత్రమే హెచ్ 1బీ వీసాలు జారీ చేయాలని అమెరికా చట్టసభ నిర్దేశించింది. అమెరికాలో డిగ్రీ లేదా ఆపై ఉన్నత చదువులు చదివిన వారి నుంచి వచ్చే మొదటి 20,000 దరఖాస్తులను ఈ పరిమితి నుంచి మినహాయించారు. ఒకే ఉద్యోగి తరఫున కంపెనీలు బహుళ దరఖాస్తులు దాఖలు చేస్తే తిరస్కరిస్తామని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) ఇప్పటికే ప్రకటించింది.  సోమవారం నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని, పరిశీలనకు సమయం సరిపోనందున ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశామని, ఈ ప్రాసెసింగ్ ప్రారంభం గురించి తరువాత ప్రకటిస్తామని ఆ సంస్థ పేర్కొంది. దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తే ఇదివరకటి మాదిరిగా కంప్యూటర్ డ్రాతో నిర్ణీత సంఖ్యలో దరఖాస్తులను ఎంపిక చేస్తారా లేదా అన్న విషయం యూఎస్‌సీఐఎస్ ఇంతవరకు స్పష్టం చేయలేదు.

దరఖాస్తుదారులు దరఖాస్తు ఫారంలో అన్ని విభాగాలను సరిగా నింపాలి, లబ్ధిదారుకు చెందిన వ్యాలిడ్ వీసా ప్రతిని దానితో జతపరిచి సమర్పించాలని యూఎస్‌సీఐఎస్ తెలిపింది. మరోవైపు అమెరికా తమ దేశంలో ప్రవేశించే వారికి ఇచ్చే వీసా ప్రక్రియను కూడా కఠినతరం చేసేలా నిబంధనలు రూపొందిస్తోంది. వీసా దరఖాస్తుదారులు గత ఐదేండ్లలో ఉపయోగించిన ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌ ఐడీ, ఫేస్‌బుక్‌ ఖాతాల వివరాలను సమర్పించాలని యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు