బాబు బాటలో జగన్

బాబు బాటలో జగన్

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితి ఇది. జగన్ ఏం చేస్తాడా..ఏం మాట్లాడుతాడా? ఒంటికాలిపై లేద్దామా అని తెలుగుదేశం నాయకులు దివారాత్రాలు ఎదురుచూస్తుండగా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ పొరబాటు చేస్తారా .. ఏకీ పారేద్దామా అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎదురుచూస్తున్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రప్రజల సంపదను దోచి సోనియాకు పంపేవారని, ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష కోట్లు దోచుకుని, గతాన్ని మరచి నీతులు వల్లిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. కొంతమంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్లు బాబుకు జగన్ ఫోబియా ఉందో లేదో తెలియదు గాని జగన్‌కు బాబు మేనియా ఉన్నట్లు కనిపిస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకులను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నప్పటికీ జాతీయ స్థాయిలో జగన్ ఎత్తులన్నీ చంద్రబాబును తలపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గతంలో సన్నిహితంగా ఉన్న నాయకులతో చెలిమి చేయడానికి, పొత్తులు పెట్టుకోవడానికి జగన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సమైక్య రాష్ట్రం పేరిట వివిధ రాష్ట్రాలలో జరుపుతున్న పర్యటనలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

మరోవైపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంబటి రాంబాబు, రోజా వంటి నాయకులు తెలుగుదేశం నాయకులను తీవ్రంగా విమర్శిస్తున్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి మూడేళ్ళ పాలనను విమర్శించిన రోజా పనిలో పనిగా చంద్రబాబును కూడా దుయ్యబట్టారు. కిరణ్, చంద్రబాబు కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. చంద్రబాబు నుంచి తెలుగుదేశం పార్టీలోని కిందిస్థాయి నాయకుల వరకు అందిరికీ జగన్ ఫోబియా పట్టుకుందని, అందుకే జగన్ ఏం చేసినా వారు కలవర పడుతున్నారని, జగన్ రాష్టప్రతిని కలవడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు.

విచిత్రమేమంటే ఈ రెండు పార్టీల నాయకులు పరస్పరం తిట్టుకున్నా కిరణ్‌కుమార్ రెడ్డిపై విమర్శల సంగతి వచ్చే సరికి ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం ఉంటోంది. అందుకే సమైక్యాంధ్రలో రచ్చబండను రెండు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తిరుపతిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు రచ్చ రచ్చ చేశారు. విశేషమేమంటే రాయలసీమలో కిరణ్‌కుమార్ రెడ్డి రచ్చబండకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తూ రాజశేఖర రెడ్డి మరణించడంతో రాష్టమ్రే కాదు దేశమే ఒక గొప్ప నాయకుణ్ణి కోల్పోయిందని కిరణ్ గుర్తుచేశారు. అదను చూసి రాజశేఖర రెడ్డి పేరును ప్రస్తావించి కిరణ్ మంచి మార్కులు కొట్టేశారు. మరి తరువాత ప్లాన్ ఏంటయా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు