వంగి న‌మ‌స్కరించి పార్టీని వంచేశాడుగా

వంగి న‌మ‌స్కరించి పార్టీని వంచేశాడుగా

రీల్ లైఫ్ లో అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు ఉంటే.. మొత్తం సినిమాకే ఎఫెక్ట్‌. రియ‌ల్ లైఫ్ లోనూ అంతే. అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాల‌కు అవ‌కాశం ఇస్తే.. సీన్ మొత్తం మార‌ట‌మే కాదు.. కొన్ని సంద‌ర్భాల్లో మొత్తంగా మునిగిపోయే ప‌రిస్థితి. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ.. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కుడి భుజం లాంటి విజ‌య‌సాయిరెడ్డి తీరు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసింది.

లోక‌మంతా ఒక‌లా ఆలోచిస్తుంటే.. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోలా ఆలోచిస్తారా? అన్న అనుమానం క‌లిగేలా తాజా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాది క్రితం వ‌ర‌కూ ప్ర‌ధాని మోడీ గ్రాఫ్ కు ఏమాత్రం ఢోకా లేదు. ఆయ‌న దూసుకెళుతున్న తీరు చూసినోళ్లు మ‌రో ప‌దేళ్లు ప్రైమ్ మినిస్ట‌ర్ గా క‌న్ఫ‌ర్మ్ చేసుకున్నారు. డామిట్.. క‌థ అడ్డం తిరిగిన చందంగా గ‌డిచిన ఆర్నెల్ల‌లో మోడీ మాష్టారి గ్రాఫ్ ప్ర‌భావిత‌మైనంత దారుణంగా గడిచిన నాలుగేళ్ల‌లో ప్ర‌భావితం కాలేద‌ని చెబుతున్నారు.

ఇలాంటి విష‌యాల్ని ప‌సిగ‌ట్ట‌టంలో అంద‌రి కంటే ముందు ఉండే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల మైండ్ సెట్ ను గుర్తించి మోడీతో క‌టీఫ్ చెప్పేశారు. నాటి నుంచి సీన్ మొత్తంగా ఎంత‌లా మారిందో తెలుగోళ్ల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. నిన్న మొన్నటి వ‌ర‌కూ ఆహా మోడీ.. ఓహో మోడీ అంటూ పొగిడేసిన బాబు మొద‌లు చిన్న‌.. పెద్దా తేడా లేకుండా ప్ర‌ధాని తీరును.. ఆయ‌న మాట‌ల్ని త‌ప్పు ప‌ట్టే ధోర‌ణి అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఇలాంటివేళ‌లో.. పార్ల‌మెంటులో ఎంపీలంతా చూస్తున్న వేళ‌.. ప్ర‌ధాని మోడీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి వంగి న‌మ‌స్కారం పెట్ట‌టం హాట్ టాపిక్ గా మారింది
ప్ర‌ధాని ప‌ద‌విలో ఉన్న నేత‌కు.. పార్టీల‌కు అతీతంగా న‌మ‌స్కారం పెట్ట‌టం త‌ప్పేం కాదు. అది మొద‌ట్నించి ఉన్న‌దే. అయితే.. త‌న‌కు న‌మ‌స్కారం పెట్టే వారికి తిరిగి న‌మ‌స్కారం పెట్టేంత పెద్ద మ‌న‌సు మోడీకి ఉండ‌ద‌ని చెబుతారు. దీనికి నిద‌ర్శ‌నంగా త్రిపుర‌లో బీజేపీ స‌ర్కారు కొలువుతీరే వేళ‌లో త‌న రాజ‌కీయ గురువు.. బీజేపీకి పెద్దదిక్కు అద్వానీ న‌మ‌స్కారం పెట్టినా.. క‌నీసం ఆ వైపు చూడ‌ని మోడీ తీరు ఆయ‌న్ను విప‌రీతంగా డ్యామేజ్ చేసింది. ఈ చిట్టి వీడియో ఎంత‌లా వైర‌ల్ అయ్యిందో.. అంత‌కు రెట్టింపు డ్యామేజ్ మోడీకి జ‌రిగింది.

త‌న‌కు లైఫ్ ఇచ్చిన పెద్ద‌మ‌నిషి విష‌యంలో మోడీ ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అన్న‌ది జీర్ణించుకోలేని రీతిగా మారింది. ఇలాంటివేళ‌.. మోడీ ద‌గ్గ‌ర‌కు సొంత పార్టీ నేత‌లు సైతం ఆచితూచి వెళుతున్న వేళ‌.. విజ‌యసాయి రెడ్డి మాత్రం నేరుగా మోడీ ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. ఆయ‌న‌కు పాదాభివంద‌నం చేయ‌టం అంద‌రిని ఆక‌ర్షిస్తే.. ఆంధ్రోళ్ల‌కు భారీ షాక్ త‌గిలినంత ప‌నైంది.
 
ఓప‌క్క మోడీ స‌ర్కారుపై నాన్ స్టాప్ గా అవిశ్వాస తీర్మానం పెడుతున్న పార్టీకి చెందిన నేత ఒక‌రు.. మోడీ పాదాభివంద‌నం చేయ‌టం ద్వారా అవిశ్వాస తీర్మానం వెనుక ఉద్దేశాన్ని చెప్ప‌క‌నే చెప్పేసిన‌ట్లైంది. ఇదే.. ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌రింత షాకింగ్ గా మారింది. ఇదిలా ఉంటే.. విజ‌య‌సాయి డ్రామాను మోడీ మ‌రింత ర‌క్తి క‌ట్టించారు. త‌న‌కు పాదాభివందనం చేసిన విజ‌యసాయి రెడ్డిని కుశ‌ల ప్ర‌శ్న‌ల‌తో ప‌లుక‌రించిన మోడీ.. ఆయ‌న త‌న‌కెంత అవ‌స‌ర‌మైన వ్య‌క్తి అన్న విష‌యాన్ని వ్య‌వ‌స్థ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చేశారు. ఇదొక్క‌టి చాలు.. విజ‌య‌సాయిని వెంటాడి వేధిస్తున్న సంస్థ‌ల‌కు.. వారి ప్ర‌తినిధుల‌కు చ‌క్క‌టి సందేశాన్ని పంపించ‌టానికి.

ఒక పెద్ద మ‌నిషికి వంగి న‌మ‌స్కారం పెడితే ఎంత లాభ‌మ‌న్న‌ది విజ‌య‌సాయి రెడ్డికి తెలిసినా.. దాని కార‌ణంగా పార్టీకి జ‌రిగే న‌ష్టాన్ని మాత్రం ఆయ‌న ప‌ట్టించుకోలేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ విష‌యాన్ని లోతుగా ఆలోచించే త‌త్త్వం.. తీరుబ‌డి విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్  కు లేద‌నే చెప్పాలి. దీంతో.. ఒక కీల‌క ఘ‌ట్టాన్ని.. త‌న‌ను త‌న పార్టీని అమితంగా డ్యామేజ్ చేసిన వైనాన్ని జ‌గ‌న్ గుర్తించ‌లేద‌న్న విష‌యం చెప్ప‌క త‌ప్ప‌దు.

విజ‌య‌సాయి రెడ్డి వంగి న‌మ‌స్క‌రించ‌టం.. త‌న పార్టీని ప్ర‌జ‌ల్లో ఉన్న న‌మ్మ‌కాన్ని వంగిపోయేలా  చేయ‌టంతో పాటు.. ఏపీకి ద్రోహం చేసిన వారి ప‌ట్ల త‌న‌కున్న అమిత‌మైన భ‌క్తి శ్ర‌ద్ధ‌ల్ని నిస్సిగ్గుగా ప్ర‌క‌టించుకున్న వైనానికి రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.