ఆ ఇద్ద‌రు తండ్రులు.. దేశ‌మంతా గ‌ర్విస్తోంది

ఆ ఇద్ద‌రు తండ్రులు.. దేశ‌మంతా గ‌ర్విస్తోంది

భార‌త‌దేశం భిన్న‌త్వంలో ఏక‌త్వం క‌ల‌గ‌లిసిన దేశం. ఇక్క‌డున్న‌న్ని మ‌తాలు... కులాలు... భాష‌లు... విభిన్న జాతులు... విభిన్న సంస్కృతీ, సంప్ర‌దాయాలు... వేరే ఏ దేశంలోనూ క‌నిపించ‌వేమో! అందుకే ఇండియా అంటే ఒక దేశం కాదు... ఇదో ఉప ఖండం.  మ‌రెక్క‌డా క‌నిపించ‌ని ప‌ర‌మ‌త స‌హ‌నం ఇక్క‌డే స్ప‌ష్టంగా కనిపిస్తూ ఉంటుంది.  కొన్ని విదేశీ శ‌క్తులు... రాజ‌కీయ కుయుక్తులు దేశంలో ఎన్ని ర‌కాలుగా కుట్ర‌లు చేయాల‌ని చూసినా... భార‌తీయ ఆత్మ ఇంకా బ‌తికే ఉంది. అందుకే నిద‌ర్శ‌న‌మే ఈ ఇద్ద‌రు.

ప‌శ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ లో జ‌రిగిన శ్రీ‌రామ‌న‌వ‌మి జైత్ర‌యాత్ర‌లో అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌ల కార‌ణంగా హింస చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఈ హింసాకాండ‌లో ఇప్ప‌టికే న‌లుగురు చ‌నిపోయార‌ని తేలింది.  ఇందులో అసన్సోల్ లోని మ‌సీదులో ఇమామ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న మౌలానా ఇమ్దాదుల్ ర‌షిదీ 16 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే కొడుకు మ‌ర‌ణ‌వార్త తెలిసిన మౌలానా రషీద్‌, త‌న మ‌త‌స్థుల‌ను హెచ్చ‌రించాడు. కొడుకును చంపిన వాళ్ల‌ను న‌ర‌క‌మ‌నో... చంప‌మ‌నో కాదు. ‘నా కొడుకు హ‌త్య‌కు ఎవ్వ‌రైనా ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని చూస్తే... నేను ఈ ఊరు వ‌దిలి వెళ్లిపోతా...’ నంటూ హెచ్చ‌రించాడు. జ‌రిగిన సంఘ‌ట‌న ఓ ప్ర‌మాద‌మ‌ని, దాని మీద ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని చూడ‌డం అన్యాయ‌మ‌ని చెప్పాడు.

అలాగే ఢిల్లీలో ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తున్నాడ‌ని అంకిత్ సక్సెనా అనే ఓ హిందూ కుర్రాడిని న‌డిరోడ్డు మీదే చంపేశారు... ఆ అమ్మాయి కుటుంబీకులు. ఇరు వ‌ర్గాల మ‌తాలు వేరు కావ‌డంతో ఈ హ‌త్య వార్త‌ల్లో నిలిచింది. దాంతో మ‌తోన్మాద దాడిగా చిత్రీక‌రించాయి కొన్ని ఛానెళ్లు. దీనిపై స్పందించిన అంకిత్ తండ్రి...‘నా కొడుకుది హ‌త్యే కాని... దాన్ని మతంతో లింకు పెట్టోద్దు...’ అంటూ విజ్ఞ‌ప్తి చేశాడు. కొడుకు పోయిన బాధ‌ను దిగ‌మింగుకుని... త‌న స్వార్థం కోసం దేశంలో అల్ల‌ర్లు, అశాంతి సృష్టించ‌డం ఇష్టం లేదంటూ ప్ర‌క‌టించాడు అంకిత్ తండ్రి.

‘అస‌హ‌నం’ అనే కొత్త ప‌దాన్ని సృష్టించి, మ‌తాల మ‌ధ్య చిచ్చుపెడుతూ ఓట్లు సంపాదించేందుకు కొన్ని రాజ‌కీయ శ‌క్తులు ప్ర‌య‌త్నిస్తున్నాయి. దేశంలో ఏ చిన్న‌సంఘ‌ట‌న జ‌రిగినా... దాన్ని సంచ‌ల‌నం చేసేసి టీఆర్‌పీ పెంచుకోవాల‌ని కొన్ని ఛానెళ్లు చూస్తున్నాయి... ఇలా ఎవ‌రెన్ని ప్ర‌య‌త్నాలు చేసినా... దేశంలో మ‌తం పిచ్చి, కులం కుళ్లు అంటుకోని వారెంద‌రో ఉన్నార‌ని నిరూపిస్తున్నారు ఈ ఇద్ద‌రు తండ్రులు. ప్ర‌ముఖుల‌తో పాటు చాలామంది సాధార‌ణ జ‌నం కూడా ఈ ఇద్ద‌రు తండ్రుల‌ను మెచ్చుకుంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు