హెచ్‌1బీ వీసా..అమెరికా కొత్త హెచ్చ‌రిక‌

హెచ్‌1బీ వీసా..అమెరికా కొత్త హెచ్చ‌రిక‌

అమెరికా వీసాల‌పై అందులో ప్ర‌ధానంగా ఉద్యోగ‌, ఉపాధి వీసాల‌పై క‌న్నెర్ర చేస్తున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ స‌ర్కారు తాజాగా ఇందులో కొత్త ష‌ర‌తును చేర్చింది. భారతీయ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా కోరుకునే హెచ్1బీ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుల ప్రక్రియ మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అమెరికా పౌరసత్వ, వలససేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) కొత్త‌ హెచ్చరికలు జారీ చేసింది. హెచ్1బీ కోసం బహుళ దరఖాస్తులను సమర్పిస్తే అవి తిరస్కరణకు దారితీస్తాయని ఓ ఫెడరల్ అమెరికన్ ఏజెన్సీ విదేశీ ఉద్యోగుల‌ను హెచ్చరించింది. బహుళ దరఖాస్తుల విషయంలో నిశిత పరిశీలనను తీవ్రం చేస్తామని తెలిపింది.

త‌మ నూత‌న నిబంధ‌న‌ల గురించి  అమెరికా పౌరసత్వ, వలససేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) వివ‌రిస్తూ `మొదట నోటీసులిస్తాం. ఆ తర్వాతే చర్యలుంటాయి. చట్టబద్ధమైన వ్యాపార అవసరాలుంటే తప్ప, మిగిలిన సందర్భాల్లో ఒక లబ్ధిదారుడికి సంబంధించి సంబంధిత సంస్థల ద్వారా వచ్చిన అన్ని పిటిషన్లను తిరస్కరించడంగానీ రద్దుచేయడంగానీ చేస్తాం`అని స్పష్టంచేసింది. హెచ్1బీ కార్యక్రమం ఊహాజనిత ఉపాధిని అనుమతించదని, ఒకే లబ్ధిదారు పేరుమీద పలు దరఖాస్తులు సమర్పించడం అంటే లాటరీ విధానం ఉద్దేశాన్ని దెబ్బతీయడమే అవుతుందని యూఎస్‌సీఐఎస్ తెలిపింది.

ఇదిలాఉండ‌గా... హెచ్1బీ వీసాదారుడి జీవిత భాగస్వామికి ఉద్యోగ అనుమతి (వర్క్ పర్మిట్) ఇచ్చే మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో... అమెరికా కొలువులపై విదేశీ నిపుణుల్లో నిరాసక్తత పెరుగుతుందని ఇమ్మిగ్రేషన్ న్యాయవాద సంస్థ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ అభిప్రాయపడింది. కాగా, హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ట్రంప్ ప్రభుత్వం వర్క్‌పర్మిట్లను రద్దు చేసే యోచనలో ఉన్న నేపథ్యంలో వారంతా ఈసారి హెచ్1బీ వీసాల కోసం క్యూ కడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు