ఒకే నిర్ణ‌యంతో కేసీఆర్‌, కేటీఆర్ మ‌న‌సుదోచుకున్నారు

ఒకే నిర్ణ‌యంతో కేసీఆర్‌, కేటీఆర్ మ‌న‌సుదోచుకున్నారు

తెలంగాణ ముఖ్య‌మంత్రి, కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడైన రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఏక‌కాలంలో అనేక‌మందిమ‌న‌సు గెలుచుకునే కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కేసీఆర్ త‌న ఎన్నిక‌ల హామీని నిల‌బెట్టుకుంటే...కేటీఆర్ కొత్త హామీ ఇవ్వ‌డం ద్వారా ఈ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు.  

గ్రామసీమలకు సంపూర్ణ రాజ్యాధికారం కల్పించే దిశగా నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా గిరిజన గూడేలను, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశామన్నారు. ఈ పంచాయతీల అభివృద్ధికి బడ్జెట్‌లోనే నిధులు కేటాయించామని చెప్పారు. వేలమందితో వందల సమావేశాలు నిర్వహించి సమగ్రంగా ఈ బిల్లును రూపొందించామని తెలిపారు.

అసెంబ్లీలో పంచాయతీరాజ్, పురపాలక చట్ట సవరణలపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు మరింత పటిష్ఠమై పకడ్బందీగా పనిచేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం అంకితభావంతో వ్యవహరిస్తున్నదని తెలిపారు. ప్రతి గ్రామానికి, మున్సిపాలిటీకి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. గ్రామాలకు రూ.1500 కోట్లు.. మున్సిపాలిటీలకు రూ.1000 కోట్లు వస్తాయని చెప్పారు. ఏజెన్సీ సహా మొత్తంగా 2637 గ్రామాలు గిరిజన సోదరుల ఏలుబడిలో ఉంటాయని తెలిపారు.

ఇక నగరపంచాయతీలు ఉండవని, సర్పంచ్‌ల టర్మ్ పూర్తయిన తరువాతనే కొత్త మున్సిపాలిటీలు అమలులోకి వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. రానున్న సమావేశాల్లో మున్సిపల్ సమగ్ర చట్టం తెస్తామన్నారు. పంచాయతీరాజ్ ఉద్యమాన్ని చేపట్టింది ఎస్కే డే అని, అద్భుతమైన వ్యవస్థను రాజకీయాలతో దెబ్బతీశారని తప్పుబట్టారు. సమన్వయ సమితిలకు, గ్రామ పంచాయతీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో నూతనాధ్యాయం మొదలయిందని చెప్పారు.

కాగా,  కొత్త మున్సిపాలిటీల్లో చుట్టుపక్కల గ్రామ పంచాయతీలను విలీనంచేసిన సందర్భంగా ఆయా గ్రామాలకు పన్నులభారంపై ప్రభు త్వం ఆలోచిస్తున్నదని, రెండు మూడేళ్లు పెంచిన పన్నును మినహాయిస్తూ యథావిధిగా చెల్లించే ఏర్పాటు చేస్తుందని పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. గురువారం మండలిలో మున్సిపల్ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా.. సభ్యుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. పన్నులు కట్టడం అనేది మంచి సంస్కారమని, వాటి ద్వారానే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కట్టే పన్నుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని, జరిగే అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. 2014లో తాను పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా ఉన్నప్పు డు కేవలం 50 శాతం పన్నులు వసూలయ్యేవని, దా నిని 75 శాతానికి పెంచామని తెలిపారు.

అధికార వికేంద్రీకరణతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని భావించిన ముఖ్యమంత్రి రాష్ట్రం సాధించినప్పటి నుంచి ఈ దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. అభివృద్ధిపథంలో సాగుతున్న తెలంగాణ పట్టణీకరణలో పురపాలక శాసనాల చట్టం కీలకఘట్టం అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36 శాతం జనాభా పట్టణాల్లో ఉన్నదని, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల వల్ల ఈ జనాభా 42 నుంచి 43 శాతం వరకు పెరుగుతుందని మంత్రి చెప్పారు. బడ్జెట్ కేటాయింపుల్లో మున్సిపాలిటీలకు రూ.వెయ్యి కోట్లు, పంచాయతీలకు రూ.1500 కోట్లు ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు