బాబును మ‌రోసారి కెలికిన బీజేపీ నేత‌లు

బాబును మ‌రోసారి కెలికిన బీజేపీ నేత‌లు

ఏపీకి ప్ర‌త్యేక హోదాకు సంబంధించి టీడీపీ చేస్తున్న పోరాటం బీజేపీని అస‌హ‌నానికి గురి చేస్తున్న‌ట్లుగానే క‌నిపిస్తోందా? అంటే అవున‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే నాలుగేళ్లుగా తాము ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేమ‌ని చెబుతూ వ‌చ్చినా... స‌రేన‌న్న టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... ఇప్పుడు హ‌ఠాత్తుగా త‌మ‌కు ప్ర‌త్యేక హోదానే కావాలంటూ బీష్మించ‌డం నిజంగానే బీజేపీకి ఆగ్ర‌హం తెప్పిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

పాయింటేంటంటే... వారి ఆగ్ర‌హానికి ఏపీలో ఆద‌ర‌ణ లేదు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుపైకి ఒక్క‌టొక్క‌టిగా అస్త్రాలు వ‌దులుతున్న బీజేపీ... ఇప్పుడు ఏకంగా గ‌వ‌ర్న‌ర్‌కు బాబుపై ఫిర్యాదు చేయించేందుకు కూడా రంగం సిద్ధం చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ దిశ‌గా కాసేప‌టి క్రితం బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా బాబును కార్న‌ర్ చేసేందుకు బీజేపీ కాస్త నెమ్మదిగానే అయినా... ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్ ఏ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశార‌న్న విష‌యానికి వ‌స్తే... కాసేప‌టి క్రితం అమ‌రావ‌తి వేదిక‌గా మీడియా ముందుకు వ‌చ్చిన మాధ‌వ్‌...  చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకుని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీపై విమర్శలు చేసేందుకు అసెంబ్లీని చంద్రబాబు ఉపయోగించుకొంటున్నారని మాధవ్ విమర్శించారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీలో కొన్ని రోజులుగా చంద్రబాబు త‌మ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారని మాధవ్ గుర్తు చేశారు.  ఏపీ అసెంబ్లీని వేదికగా చేసుకొని ప్రధాన మంత్రి మోదీపై నిందలు వేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్న‌ మాధవ్... ఏపీకి నిధులు కేటాయించినా.. నిధులు కేటాయించలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ నిధులు రావడానికి ఆలస్యమైందని చెప్పిన‌ మాధవ్... అందుకు కార‌ణం రాష్ట్ర ప్రభుత్వమే కారణమని  చెప్పారు.కేంద్రం సూచించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో అమిత్ షా రాసిన లేఖకు సమాధానం ఇవ్వాలని మాధవ్ డిమాండ్ చేశారు. .అమిత్ షా లేఖకు సమాధానం ఇవ్వకుండా డొంక తిరుగుడుగా చంద్ర‌బాబు మాట్లాడుతున్నార‌ని ఆయన దుయ్యబట్టారు. ఎన్డీఏ నుండి వైదొలిగిన సమయంలో  చంద్రబాబు... అమిత్‌షాకు రాసిన లేఖకు సమాధానంగా అమిత్ షా కూడ ఇటీవలే ఓ లేఖ రాశారని మాధ‌వ్ గుర్తు చేశారు.

ఉద్దేశ్యపూర్వకంగానే బీజేపీ, ప్రధాన మంత్రి మోదీపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మాధవ్ మండిప‌డ్డారు. ఇందుకు అసెంబ్లీని చంద్రబాబు వేదికగా ఉపయోగించుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయమై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.ఈ విషయమై స్పీకర్ ఎందుకు చంద్ర‌బాబును అనుమతిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఏపీలో ఏనాడూ కూడ టీడీపీ ఒంటరిగా విజయం సాధించలేదని మాధవ్ ఎద్దేవా చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో 1999లో టీడీపీ విజయంలో బీజేపీ కీలకపాత్ర పోషించిందని ఆయన చెప్పారు. మరోవైపు 2014 ఎన్నికల్లో కూడ ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి కూడ బీజేపీనే కారణమన్నారు.  మొత్తంగా చంద్ర‌బాబుపై బీజేపీ త‌న‌దైన శైలి దాడిని మొద‌లుపెట్టింద‌న్న మాట‌. మ‌రి ఈ దాడిని చంద్ర‌బాబు ఏ విధంగా తిప్పికొడ‌తారో చూడాలి.

చిత్ర‌మైన విష‌యం ఏంటంటే... అటు ప‌వ‌న క‌మిటీ, ముఖ్య‌మంత్రి, ఏపీ ప్ర‌జ‌లు కూడా ఆధారాల‌తో స‌హా బీజేపీ నిధులు ఇవ్వ‌లేద‌ని చూపించినా ఏ ధైర్యంతో బీజేపీ ఇలా మ‌ళ్లీ మ‌ళ్లీ అబ‌ద్ధాలు చెబుతుంద‌న్న‌ది ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. అస‌లు బీజేపీ స్ట్రాట‌జీ త‌న గొయ్యి తానే త‌వ్వ‌కునేలా ఉంది. ఇదంతా చూసిన వాళ్లు అస‌లు బీజేపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో నోటాతో పోటీ ప‌డ‌టానికి సిద్ధ‌మైన‌ట్లు క‌నిపిస్తోంది అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు