కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కునుడేంది జ‌గ‌నా?

కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కునుడేంది జ‌గ‌నా?

అబ‌ద్ధాన్ని.. అస‌త్యాన్ని ఎక్కువ కాలం దాచి పెట్ట‌లేం. కోట్లాది మందిని మాయ‌తోమోసం చేయాల‌నుకుంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని ఊరికే అన‌లేదేమో?  తాజాగా జ‌గ‌న్ తీరు చూస్తే.. ఇట్టే అర్థం కాక మాన‌దు. ఓప‌క్క మోడీ మీద గాండ్రిపులు చేస్తున్న‌ట్లు క‌ల‌రిచ్చే వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు.. మ‌రోవైపు అదే పార్టీకి చెందిన ఎంపీ మోడీకి పాదాభివంద‌నం చేయ‌టం చూస్తే.. కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కోవ‌టంలో జ‌గ‌న్ కు మించినోళ్లు మ‌రొక‌రు ఉండ‌రేమో?

ఏపీ విప‌క్షంగా.. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో విజ‌యం సాధించ‌ట‌మే ధ్యేయంగా పెట్టుకున్న జ‌గ‌న్ కు.. కాలం క‌లిసి రావ‌టం లేద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తుంటుంది. మ‌రికొంద‌రు మాత్రం.. ఆయ‌న‌కు ఆ అర్హ‌త లేద‌న్న మాట‌ను చాలా బ‌లంగా విశ్వ‌సించ‌ట‌మే కాదు.. త‌మ వాద‌న‌ను లాజిక్ గా వినిపిస్తుంటారు.

ముఖ్య‌మంత్రి సీట్లో కూర్చోవాల‌నుకునే వ్య‌క్తికి స‌మ‌జంగా ఉండాల్సిన క‌రుణ‌.. ద‌య లాంటివి జ‌గ‌న్ లో క‌నిపించ‌వ‌ని.. ఆ మాట‌కు వ‌స్తే పార్టీ ఎమ్మెల్యేలు.. ఎంపీల‌ను ఆయ‌న ప‌ట్టించుకోర‌న్న ఆరోప‌ణ ఉంది.

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాలంటే పాద‌యాత్ర‌లు.. గ‌ట్రా అవ‌స‌రం లేద‌ని.. కాస్తంత మంచిత‌నం. మ‌రికాస్త ఓపెన్ నెస్ తో పాటు.. అహంకారం ఎంత త‌గ్గించుకుంటే అంత త్వ‌ర‌గా ఆయ‌న ఇమేజ్ గ్రాఫ్ పెరుగుతుంద‌ని చెబుతారు. జ‌గ‌న్ తండ్రి వైఎస్ ఏ విధంగా అయితే న‌మ్మినోళ్ల‌ను.. న‌మ్ముకున్నోళ్ల‌కు ఏదో ఒక‌టి చేయాల‌ని త‌పించ‌టంతో పాటు.. త‌న‌ను అభిమానించే వారిని రెట్టింపుగా ప్రేమించే ధోర‌ణిని వంట‌బ‌ర్చుకోవాల్సి ఉంటుంద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది.

దుర‌దృష్ట‌వ‌శాత్తు అవేమీ జ‌గ‌న్ లో క‌నిపించ‌వ‌ని.. ఆ క్వాలిటీస్ ఆయ‌న కానీ తెచ్చుకోగ‌లిగితే.. ఆటోమేటిక్ గా ఆయ‌న సీఎం అయిపోతార‌ని చెబుతారు.
ఇదంతా ఎందుకంటే.. తాను ఎలా ఉండాల‌ని అత్య‌ధికులు కోరుకుంటారో అలా ఉండ‌టం జ‌గ‌న్ కు మొద‌ట్నించి చేత‌కాద‌ని చెప్ప‌టానికే. ఆయ‌న వ్య‌క్తిగ‌త విష‌యాలు.. వ్య‌క్తిత్వ అంశాల్ని ప్ర‌స్తావించాల్సి వ‌చ్చింది. ఇదంతా ప‌క్క‌న పెడితే.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం చూస్తే.. కూర్చున్న చెట్టుకొమ్మ‌ను త‌న‌కు తానే న‌రుక్కోవ‌టం జ‌గ‌న్ కు ఎంత బాగా వ‌చ్చో ఇట్టే అర్థ‌మ‌వ‌తుంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీతో జ‌త క‌ట్టేందుకు జ‌గ‌న్ ఊవ్విళ్లూరుతున్నార‌ని.. ఎంపీ సీట్లు మోడీ బ్యాచ్ కు అప్ప‌జెప్పి.. స్టేట్ సీట్లు అత్య‌ధికం త‌న ద‌గ్గ‌ర ఉంచుకునే ఫార్ములాలో ఇప్ప‌టికే క‌మ‌ల‌నాథుల‌తో క‌మిట్ మెంట్ చేసుకున్నార‌ని చెబుతారు. ఇందులో నిజానిజాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. మోడీతో జ‌గ‌న్ ట‌చ్ లో ఉన్నార‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది కూడా రాజ్య‌స‌భ సాక్షిగా. జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడైన విజ‌య‌సాయి రెడ్డి ఈ రోజు మోడీ దగ్గ‌ర‌కు వెళ్లి పాదాభివందం చేయ‌టం.. ఆయ‌న సంత‌సించి.. వీపు త‌ట్టి లేవ‌దీసి అభినందించ‌టం లాంటివి చూస్తే.. ఆంధ్రోడి ఒంటికి కారం రాసిన‌ట్లు ఉంటుంది.

హోదా విష‌యంలో ఏపీకి హ్యాండ్ ఇచ్చిన పెద్ద మ‌నిషితో విప‌క్ష నేత స‌న్నిహితుడు వెళ్లి పాదాభివందం చేయ‌టం ఏమిటి?  హ్యాండిచ్చినోడికి హ్యాండ్ ఇవ్వాల్సింది పోయి.. హ్యాండ్ ప‌ట్టుకుంటాన‌న్న జ‌గ‌న్ వ్యూహం ఇప్పుడాయ‌న అభిమానుల్ని సైతం అదిరిప‌డేలా చేస్తోంది. ఏమైనా.. ఇలాంటి బ్ర‌హ్మాండ‌మైన ఐడియాలు జ‌గ‌న్ కు మాత్ర‌మే సాధ్య‌మేమో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు