జ‌గ‌న్ ను చావుదెబ్బ కొట్టిన విజ‌య‌సాయిరెడ్డి

జ‌గ‌న్ ను చావుదెబ్బ కొట్టిన విజ‌య‌సాయిరెడ్డి

కానోళ్లు దెబ్బ తీస్తే అర్థం చేసుకోవ‌చ్చు. కానీ.. అయినోళ్లే దెబ్బ కొడితే.. కోలుకోవ‌టం క‌ష్టం. మ‌రి.. తెలిసి చేశారో.. తెలియ‌క చేశారో.. లేక పూర్తిగా బ‌రి తెగించేశారో కానీ.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడు భారీ త‌ప్పు చేశారు. కొన్ని త‌ప్పుల‌కు ఖ‌రీదు క‌ట్ట‌టం క‌ష్టంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి త‌ప్పునే చేశారు విజ‌య‌సాయిరెడ్డి.

మోడీ మాట ప్ర‌స్తావిస్తేనే గ‌య్యిన లేచి ప‌డుతున్నారు ఆంధ్రోళ్లు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో వెంక‌న్న సాక్షిగా ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోని పెద్ద మ‌నిషి అంటూ తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టేస్తున్నారు. విభ‌జ‌న చేసిన‌ కాంగ్రెస్ కు ఎలా బుద్ది చెప్పామో.. ఈసారి బీజేపీకి కూడా అలాంటి గ‌తే ప‌ట్టించాల‌న్న మాట బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. విజ‌య‌సాయి రెడ్డి ఊహించ‌ని రీతిలో వ్య‌వ‌హ‌రించారు.

గ‌డిచిన కొద్దికాలంగా బీజేపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య‌న చీక‌టి ఒప్పందం ఉంద‌ని.. ఇదే ఏపీ అభివృద్దిని దెబ్బ తీస్తుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పార్టీలో పొత్తుకు మోడీ డిసైడ్ అయ్యార‌ని.. ఈ కార‌ణంగానే పొమ్మ‌న‌కుండా పొగ‌బెట్టిన చందంగా ఏపీ స‌ర్కారు విష‌యంలో మోడీ బ్యాచ్ వ్య‌వ‌హ‌రించింద‌ని చెబుతున్నారు.

హోదాపై ఏపీలో రాజ‌కీయ వేడి ర‌గులుతున్న వేళ‌.. ఏపీ అధికార‌ప‌క్షం.. విప‌క్షం రెండూ వ‌రుస పెట్టి మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం పెడుతున్న వేళ‌.. విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌ధాని మోడీకి పాదాభివందంగా చేయ‌టం షాకింగ్ గా మారింది. ఓప‌క్క ఏపీ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని చెబుతూ అవిశ్వాసం పెట్టిన జ‌గ‌న్ పార్టీ.. మ‌రోవైపు  ప్ర‌ధాని మోడీ కాళ్ల‌కు న‌మ‌స్కారం పెట్ట‌టం చూస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దొంగాట ఇట్టే అర్థం కాక మాన‌దు.

రాజ్య‌స‌భ‌కు ఈ రోజు ప్ర‌ధాని వ‌చ్చారు. ఆయ‌న రాజ్య‌స‌భ‌లోకి వ‌స్తున్న వేళ ఎంపీలంతా ఆయ‌న‌కు న‌మ‌స్కారం చేశారు. అయితే.. స‌భ్యుల న‌మ‌స్కారాన్ని ప‌ట్టించుకోని మోడీ.. బీజేపీ ఎంపీలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి న‌మ‌స్కారాల‌కు స్పందించారు. వారికి  ప్ర‌తి న‌మ‌స్కారం చేశారు. ఇలాంటి వేళ‌.. ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. విజ‌య‌సాయిరెడ్డి లేచి మోడీ వ‌ద్ద‌కు వెళ్లి.. ఆయ‌న‌కు పాదాభివందం చేశారు. ఆయ‌న్ను త‌ట్టి లేపిన మోడీ అభినందించారు.

అనంత‌రం త‌న సీట్లోకి వెళ్లి విజ‌య‌సాయిరెడ్డి కూర్చున్నారు. ఓప‌క్క లోక్ స‌భ‌లో మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టి.. రాజ్య‌స‌భ‌లో అదే మోడీకి పాదాభివందం చేసిన వైనం చూస్తే.. ఇంత‌కాలం జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర‌.. రాబోయే రోజుల్లో చేసే పాద‌శ్ర‌మ మొత్తం బూడిద‌లో పోసిన ప‌న్నీరుగా మారటం ఖాయ‌మంటున్నారు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు