కాఫీ రేటుతో చిదంబ‌రం దిమ్మ తిరిగింద‌ట‌..!

కాఫీ రేటుతో చిదంబ‌రం దిమ్మ తిరిగింద‌ట‌..!

కొంత‌మంది మేధావుల తీరు సిత్రంగా ఉంటుంది. త‌మ‌కు తెలిసిన‌ప్పుడే ప్ర‌పంచానికి జ‌రుగుతున్న అన్యాయం గురించి గుండెలు బాదేసుకోవ‌టం క‌నిపిస్తుంది. తాము ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు కూడా ఇలాంటి ప‌రిస్థితే ఉండేద‌న్న చిన్న విష‌యాన్ని మ‌ర్చిపోతారు. తామిప్పుడు మాట్లాడితే.. మీ హ‌యాంలో ఏం చేశార‌న్న క్వ‌శ్చ‌న్ అడుగుతార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోయి మ‌రీ.. అమాయ‌కంగా ప్ర‌శ్న‌లు వేయ‌టం క‌నిపిస్తుంది.

ఇలాంటి తీరును తాజాగా ప్ర‌ద‌ర్శించారు మాజీ కేంద్ర‌మంత్రి చిదంబ‌రం. ఎయిర్ పోర్టుల‌లో కాఫీ.. టీలకు భారీగా బాదేసే వైనంపై చిదంబ‌రం భారీ ఆశ్చ‌ర్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో టీ.. కాఫీ ధ‌ర‌లు ఆయ‌న‌కు దిమ్మ తిరిగిపోయేలా చేశాయ‌ని పేర్కొన్నారు.

ట్విట్ట‌ర్ లో ఆయ‌న తాజాగా ట్వీట్ చేస్తూ.. చెన్నై ఎయిర్ పోర్ట్ లోని కాఫీడేలో టీ అడిగా. వెచ్చ‌ని నీరు.. టీ బ్యాగ్ ఇచ్చారు. రూ.135 ఇవ్వాల‌న్నారు.. వెంట‌నే దాన్ని వెన‌క్కి ఇచ్చేశా. నేను చేసింది స‌రైన‌దేనా?  త‌ప్పా? అంటూ ట్వీట్ తో సందేహాన్ని వ్య‌క్తం చేశారు.

చిదంబ‌రం మాష్టారికి అర్థం కావాల్సిందేమిటంటే.. ఎయిర్ పోర్ట్ ల‌లోనే కాదు.. కాఫీడేల‌లోనూ.. చాలా మాల్స్ .. మ‌ల్టీఫ్లెక్సుల్లోనూ ఇదే త‌ర‌హాలో ధ‌ర‌ల వాయింపు ఉంటుంద‌న్న విష‌యం చిదంబ‌రానికి ఇప్ప‌టివ‌ర‌కూ  తెలీదా ఏంటి? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. నాలుగేళ్ల క్రితం వ‌ర‌కూ నాన్ స్టాప్ ప‌వ‌ర్ చేతిలో ఉండ‌టం.. జేబులో నుంచి  డ‌బ్బులు తీసే అవ‌కాశం వ‌చ్చి ఉండ‌దు.

ప‌ద‌వి పోయిన వెంట‌నే ఎంతోకొంత పాత వాస‌న‌ల బండి న‌డుస్తూ ఉండి ఉంటుంది. ప‌వ‌ర్ పోయి నాలుగేళ్లు అయిపోయిన నేప‌థ్యంలో ఇప్పుడు వాస్త‌వంలోకి చిదంబ‌రం తంబి వ‌స్తున్న‌ట్లున్నారు. ఇలాంటి ట్వీట్లు చేసే ముందు.. ఎప్ప‌టి నుంచి ఎయిర్ పోర్ట్ లో కాఫీలు.. టీలు ఇంత ఖ‌రీదుగా మారాయ‌న్న విష‌యాన్ని తెలుసుకొని ట్వీట్ చేస్తే.. ఉన్న కొద్దిపాటి ప‌రువైనా ఉంటుంది.

కాఫీ ధ‌ర రూ.180.. టీ ధ‌ర కూడా ఇంచుమించు దానికి ద‌గ్గ‌ర‌గా ఉంటున్న వేళ‌.. ఎవ‌రు కొంటారు? అని ప్ర‌శ్నించారు. చివ‌ర్లో త‌న అప్డేష‌న్ మిస్ అయ్యింద‌న్న విష‌యాన్ని కొంత‌మేర ఒప్పుకుంటూ.. చాలామంది కొంటార‌ని చెబుతున్నారు.. నేను పాత‌కాలం మ‌నిషిన‌య్యానా? అని ప్ర‌శ్నించారు. పాత‌కాలం మ‌నిషి కాలేదు.. వాస్త‌వ ప్ర‌పంచంలోకి ఇప్పుడే వ‌స్తున్నార‌నుకుంటే స‌బ‌బుగా ఉంటుందేమో చిదంబ‌రం జీ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు