బాబూ...నువ్వు సూప‌ర్: మ‌మ‌తా బెన‌ర్జీ

బాబూ...నువ్వు సూప‌ర్: మ‌మ‌తా బెన‌ర్జీ

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని కితాబు ద‌క్కింది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండే ముఖ్యమంత్రి నుంచి చంద్ర‌బాబు డైన‌మిజానికి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. బాబుకు అలా కితాబు ఇచ్చింది ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖపై సీఎం చందబాబు స్పందించిన సంగ‌తి తెలిసిందే.

అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు బీజేపీ అధ్య‌క్షుడు అమిత్‌ షా రాసిన లేఖలో అన్ని వక్రీకరణలే ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదని చెప్తూ... హోదాతో సమానంగా ఇస్తామన్న ప్యాకేజీ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. విభజన హామీలను కేంద్రం పట్టించుకోలేదని, ఏపీకి ఒక రూల్‌... మరో రాష్ట్రాలకు మరో రూలా? అని నిలదీశారు. ఈశాన్న రాష్ట్రాలకు అన్నీ ఇస్తున్నారు... ఏపీని మాత్రం విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటుగా అమిత్‌షా తీరు స‌రికాద‌ని బాబు మండిప‌డ్డారు.

అసెంబ్లీ వేదిక‌గా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిపై చంద్ర‌బాబు విరుచుకుప‌డిన తీరు, గ‌ణాంకాల‌తో ఎండ‌గ‌ట్టిన విధానం జాతీయ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఏపీ ముఖ్య‌మంత్రి ఎదురుదాడి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బీజేపీ మిత్రపక్షాలు స‌హా వైరివ‌ర్గాలు సైతం ఈ ప‌రిణామాన్ని ఆస‌క్తిగా గ‌మ‌నించాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌మ‌తాబెన‌ర్జీ సైతం బాబు ఎదురుదాడి తీరును గ‌మ‌నించారు. ప్ర‌త్యేకంగా ఓ ట్వీట్ చేస్తూ చంద్ర‌బాబును కొనియాడారు.

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుజీని నేను ప్ర‌శంసిస్తున్నాను అంటూ మ‌మ‌తా త‌న ట్వీట్ మొద‌లుపెట్టారు. `గ‌ణాంకాల‌తో స‌హా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వివ‌రించిన తీరును నేను అభినందిస్తున్నాను. వెరీ గుడ్‌. చాలా మంది నాయ‌కులు అనే వాళ్లు అబ‌ద్దాలు చెపుతున్నారు. దాన్ని వాళ్లు ఓ అల‌వాటు చేసుకున్నారు. ఆయా రాష్ర్టాల్లోని ప్ర‌భుత్వాల‌ను కుప్ప‌కూల్చాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. అయితే అనంత‌రం తామెంతో చేశామ‌ని చెప్పుకుంనేందుకు ఇలా నిధులు ఇచ్చామ‌నే ప్ర‌చారం మొదలుపెడుతున్నారు. ఇదో న‌కిలీ ఫెడ‌ర‌లిజం` అంటూ పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English