మోదీపై దక్షిణాది దండయాత్రకు కేరళ నాయకత్వం

మోదీపై దక్షిణాది దండయాత్రకు కేరళ నాయకత్వం

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం శీతకన్ను వేస్తోందని ..కేవలం ఉత్తారదికే ప్రయారిటీ ఇస్తున్నారన్న వాదన కొన్నాళ్లుగా బలపడుతూ వస్తోంది. ముఖ్యంగా ఏపీలో కొత్త పార్టీ జనసేన కొద్దిరోజుల కిందట దాన్ని బలంగా వినిపించి మళ్లీ చల్లబడినా, ఇప్పుడు ఏపీ పాలక పక్షం ఆ నినాదాన్ని ఎత్తుకుంది.

ఇదే సమయంలో ఇతర దక్షిణాది రాష్ట్రాలూ దాన్ని సీరియస్ గా తీసుకుని లోతుగా చర్చించేందుకు సిద్ధమయ్యాయి. అందుకు కేరళ రాష్ర్టం నాయకత్వం వహిస్తోంది.  నిధుల పంపకాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై లెక్కలు తేల్చేందుకు సిద్ధమైన కేరళ అందులో మిగతా దక్షిణాది రాష్ట్రాలూ భాగస్వాములు కావాలని ఆహ్వానించింది. ఏపీ నుంచి ఆర్థికమంత్రి యనమల ఈ సమావేశానికి వెళ్తున్నారు.

దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు రావాలంటూ తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి ఆర్థిక మంత్రులకు కేరళ ఆర్థిక మంత్రి ఫోన్లు చేశారు. ఈ నేపథ్యంలో, భేటీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆర్థిక మంత్రి యనమల కోరారు. దానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు.  

2011 జనాభా ప్రతిపదికన నిధులను కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. కుటుంబ నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తగ్గిందని, ఇదే సమయంలో ఉత్తరాది జనాభా విపరీతంగా పెరిగిపోయింది.. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో జనాభా నియంత్రణ లేని రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వస్తున్నాయని యనమల చెప్పారు.

కాగా ఆర్థిక మంత్రుల స్థాయిలో ఇలా దక్షిణాది వివక్షపై సమావేశం జరిగితే కేంద్రానికి గట్టి హెచ్చరికలే వెళ్లే అవకాశాలున్నాయి. మరి.. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు