ఏపీలో త్రిపుర‌- ఒక ప‌గ‌టి క‌ల !

ఏపీలో త్రిపుర‌- ఒక ప‌గ‌టి క‌ల !

బీజేపీతో టీడీపీ తెగ‌దెంపులు చేసుకున్న త‌ర్వాత టీడీపీపై బీజేపీ విమ‌ర్శ‌నాస్త్రాలు స్పీడు పెంచిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, ఆ పార్టీ నేత‌లు...ఏపీని మ‌రో త్రిపుర చేస్తామ‌ని స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. త్రిపుర‌లో జ‌రిగిన గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక శాతం ఓట్లు సాధించిన బీజేపీ...ఈ సారి ఏకంగా అధికారం చేపట్ట‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. బ‌హుశా ప్ర‌పంచంలో మ‌రే చోటా ఈ ర‌క‌మైన ఫ‌లితం వ‌చ్చి ఉండ‌దు. ఇటువంటి ప్ర‌క‌ట‌ల‌ను బీజేపీ అభిమానుల‌కు క‌చ్చితంగా ఉత్తేజాన్నిస్తాయ‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.

ఈశాన్య రాష్ట్రాల‌లో బీజేపీ విజ‌యం సాధించ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించిన  రామ్ మాధ‌వ్ ను ఏపీ ఇన్ చార్జిగా  నియ‌మించ‌బోతున్నారంటూ వార్త‌లు రావ‌డం వారికి మ‌రింత కిక్ ఇచ్చి ఉంటుంది. రాజ‌కీయాలంటే చారిటీ కాద‌నే భావ‌న ఉన్న రామ్ మాధ‌వ్ తో...ఏపీలో పాగా వేయాల‌ని బీజేపీ భావిస్తోంది. గెల‌వ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ప్ర‌యత్నాల‌ను తాము చేస్తామ‌ని, ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌బోమ‌ని, కోల్డ్ బ్ల‌డెడ్ పాలిటిక్స్ చేసేందుకు సిద్ధ‌మ‌ని వ‌రంగ‌ల్ లో జ‌రిగిన స‌భ‌లో రామ్ మాధ‌వ్ స్ప‌ష్టం చేశారు. అయితే, ఏపీని మ‌రో త్రిపుర చేస్తామంటూ....బీజేపీ నేత‌లు గుప్పిస్తోన్న ప్ర‌క‌ట‌న‌లు నిజ‌మౌతాయా? అన్న సందేహం ప‌లువురిలో ఉంది.

అయితే, త్రిపుర‌లో ప‌రిస్థితులు...ఏపీలో ప‌రిస్థితులకు భిన్నంగా ఉన్నాయ‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి. గ‌డ‌చిన 40 ఏళ్ల‌లో 5 సంవ‌త్స‌రాలు మిన‌హా మిగతా 35 సంవ‌త్స‌రాలు త్రిపుర‌లో వామ‌ప‌క్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. మాణిక్ స‌ర్కార్ ప్ర‌భుత్వం పాతికేళ్లు పాలించింది. దాదాపు రెండు త‌రాలు పాలించిన పార్టీపై ప్ర‌జ‌ల‌కు మొహం మొత్త‌డం, కొత్త‌ద‌నం...మార్పు కోరుకోవ‌డం స‌హజం. అంత‌మాత్రాన వామ‌ప‌క్ష‌పార్టీల‌పై వ్య‌తిరేక‌త ఉన్న‌ట్లు కాదు.

త్రిపుర‌లో సీపీఎంను ఓడించాలంటే బీజేపీనే స‌రైన పార్టీ అని, కాంగ్రెస్...కు ఆ స‌త్తా లేద‌ని త్రిపుర ఓట‌ర్లు భావించారు. వామ‌ప‌క్ష వ్య‌తిరేక ఓట్లు ...బీజేపీకి ప‌డ్డాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఎమ్ సీలో చేరి...త‌ర్వాత బీజేపీకి మారారు. దాదాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మ‌డిగా బీజేపీలో చేరారు. సాలిడ్ కాంగ్రెస్ ఓట్ల‌న్నీ బీజేపీకి ప‌డ్డాయి. 2013 ఎన్నిక‌ల్లో లెఫ్ట్ పార్టీల‌కు 52 శాతం ఓట్లు రాగా, వామ‌ప‌క్ష పార్టీల‌కు వ్య‌తిరేకంగా 48 శాతం ఓట్లు వ‌చ్చాయి. 2018లో లెఫ్ట్ పార్టీల‌కు 7 శాతం ఓట్లు త‌గ్గి 45 శాతం ఓట్లు వ‌చ్చాయి. ఆ 7 శాతం ప్ర‌జ‌లు మార్పు కోరుకున్నారు. అదీ కాకుండా, అక్క‌డ గిరిజ‌నుల‌కు, గిర‌జ‌నేత‌రుల‌కు మ‌ధ్య చిచ్చు పెట్టి....త‌మ‌కు ప్ర‌త్యేక‌దేశం...కావాల‌ని కోరుకునే ఐపీఎఫ్ టీతో బీజేపీ పొత్తుపెట్టుకొని లాభ‌ప‌డింది. అటువంటి బ‌ల‌మైన ఐపీఎఫ్ టీ తో పొత్తు లేకుంటే త్రిపుర‌లో బీజేపీ ఎట్టి ప‌రిస్థితుల్లో అధికారంలోకి వ‌చ్చేది కాదు.

అదే, ఏపీ విష‌యానికొస్తే ...త్రిపుర‌క‌న్నా భిన్న‌మైన ప‌రిస్థితులున్నాయి. ఏపీలో పాతికేళ్లు ఏ పార్టీ అధికారంలో లేదు. టీడీపీ, వైసీపీ ల‌కు ప్ర‌తి గ్రామంలో కార్య‌క‌ర్త‌లున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ కు కూడా కార్య‌కర్తలున్నారు. కానీ, బీజేపీకి ఆ స్థాయిలో కార్య‌క‌ర్తలు లేరు. ఏపీలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంద‌రూ....లేదా వాటిలో ఏదో ఒక పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మ‌డిగా బీజేపీలో చేరే ప‌రిస్థితి లేదు. కాబ‌ట్టి , త్రిపుర త‌ర‌హాలో ఏపీలో అధికారం చేప‌డ‌దామ‌న్న బీజేపీ నేత‌ల ప్ర‌క‌ట‌న దాదాపుగా వాస్త‌వ దూరం.

ఏపీలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ నుంచి.....కావూరి సాంబ‌శివ‌రావు, పురంధ‌రేశ్వ‌రి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వంటి వారి త‌ర‌హాలో మ‌రి కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు బీజేపీలో చేరే అవ‌కాశ‌ముంది. టీడీపీ, వైపీపీ ల నుంచి టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ వారు బీజేపీలో చేరే అవ‌కాశ‌ముంది. ఏపీలో టీడీపీ, వైసీపీల మ‌ధ్య గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 2 శాతం ఓట్లు మాత్ర‌మే తేడా ఉంది. ఈ సారి ఎన్నిక‌ల్లో కూడా దాదాపుగా ఆ రెండు పార్టీల మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ ఉంటుంది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీపై, మోదీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఏపీ ప్ర‌జ‌ల అభీష్టానికి వ్య‌తిరేకంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డానికి సాహ‌సించే పార్టీ ఏపీలో క‌న‌బ‌డ‌డం లేదు.

త్రిపుర‌లో ఐపీఎఫ్ టీ త‌ర‌హాలో బీజేపీకి మ‌ద్ద‌తిచ్చే బ‌ల‌మైన పార్టీ ఏపీలో లేదు. త్రిపుర‌లోని సామాజిక ప‌రిస్థితులు, ఏపీలోని సామాజిక ప‌రిస్థితుల‌కు చాలా వ్య‌త్యాసం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల‌కు ఓటేస్తే త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్న అభిప్రాయం ఈశాన్య రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌కు ఉంటుంది. కానీ, ఏపీలో ఆ ప‌రిస్థితి లేదు. మ‌ద్రాసు నుంచి ప్ర‌త్యేక రాష్ట్రం కోరుతూ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేసిన చ‌రిత్ర క‌లిగిన ఏపీకి త్రిపుర‌కు పోలికే లేదు. ఒక రాష్ట్రాన్ని మ‌రో రాష్ట్రంలా చేస్తామ‌నే నినాదాన్ని బీజేపీ వీడి....ఏపీని ఏపీలాగే ఉంచి ఏ విధంగా అధికారంలోకి రావాలో ప్ర‌య‌త్నించ‌డం మంచిది!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు