రైతులకు 3 రూపాయ‌ల‌ చెక్కు !

రైతులకు 3 రూపాయ‌ల‌ చెక్కు !

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరులో రైతులకు రుణమాఫీ కింద రూ. 10ల మొత్తంతో చెక్కులను అందించిన వార్త దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. సీఎం యోగి ఆదిత్య‌నాథ్ స‌ర్కారు అన్న‌దాత‌ల విష‌యంలో ఇంత చిత్రంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రించింది. 17 వేల మందికి పైగా రైతులకు రూ. 1,000ల రుణమాఫీ సర్టిఫికెట్లను అందించింది. దీనిపై యూపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. రైతులు అంటే ఇంత చిన్న‌చూపా అంటూ ప‌లువురు ప్ర‌శ్నించారు. అయితే అదే బాట‌లో తమిళనాడు ప్రభుత్వం ప‌య‌నిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. రూ.3,4,5,10 చెక్కులను పంట బీమా కింద త‌మిళ‌నాడు స‌ర్కారు పంపిణీ చేసి అంద‌రినీ అవాక్క‌య్యేలా చేసింది.

తమిళనాడు రైతులు గతేడాది దేశ రాజధాని ఢిల్లీలో 144 రోజులపాటు వినూత్న ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. భయంకరమైన కరువు పరిస్థితులను ఎదుర్కొని స‌హాయం కోసం దేశ‌రాజ‌ధానిలో వారు చేసిన‌ ఆందోళన చర్చనీయాంశమైంది. కనీస మద్దతు ధర కల్పించాలని, ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను అమలుచేయాలని రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వారి ఆందోళన వివిధ రాష్ట్రాల్లో రైతుల ఉద్యమానికి బాట వేసింది. కాగా, ఇప్పుడు తమిళనాడు రైతులు మరో విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నారు. పంట బీమా పథకం కింద తమిళనాడు ప్రభుత్వం రైతులకు గత నెలలో చెక్కులు అందించింది. వాటిని చూసిన రైతులు అవాక్కయ్యారు. దిండిగల్‌, నగపట్టణం జిల్లాల్లోని రైతుకు రూ. 3 నుంచి మొదలుకొని రూ. 10 వరకూ మొత్తాలతో కూడిన చెక్కులను ఇచ్చారు.

పంట నష్టపరిహారం కింద ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా రాష్ట్ర రైతులకు ఎకరా వరికి రూ. 26 వేలు, పప్పుధాన్యాల పంటకు ఎకరాకు రూ. 12వేలు, చిరుధాన్యాలకు రూ. 20 వేలు చెల్లించాలి. కానీ వారికి ఇచ్చింది రూ.3, రూ.4, రూ.5 చెక్కులు కావ‌డం గ‌మ‌నార్హం. దిండిగల్‌లో రైతులకు కేంద్ర కో-ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ పంట నష్టపోయిన రైతులకు ఫిబ్రవరిలో ఈ చెక్కులను అందించింది. ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో శుక్రవారం ఈ అంశాన్ని లేవనెత్తడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  దీనిపై అసెంబ్లీలో మంత్రులు మాట్లాడుతూ పొరపాటు జరిగిందని.. దానిని సరిచేస్తామని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి దొరైకన్ను మాట్లాడుతూ త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని వివ‌రించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు