ఏపీలో హీరో శంకుస్థాప‌న‌... బాబు సాధించాడు

ఏపీలో హీరో శంకుస్థాప‌న‌... బాబు సాధించాడు

అశాస్త్రీయబ‌ద్ధంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను 2014లో అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం రెండు ముక్క‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. `అవశేషాంధ్రప్ర‌దేశ్` లో లోటు బ‌డ్జెట్ తో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. సీఎంగా త‌న‌కున్న అపార అనుభ‌వంతో న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప‌లు విదేశీ కంపెనీల‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఇప్ప‌టికే ఏపీలో కియా మోటార్స్, అపోలో టైర్స్, వీర వర్ణ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థ‌లు త‌ర‌లి వ‌చ్చాయి. తాజాగా, చంద్ర‌బాబు నాయుడు చొర‌వ‌తో ఏపీకి మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు వ‌చ్చింది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలో హీరో మోటార్స్  సంస్థ‌కు సీఎం చంద్ర‌బాబు నేడు శంకుస్థాప‌న చేశారు. దాదాపు రూ. 1600 కోట్లతో, 600 ఎకరాల్లో నిర్మించ‌బోతోన్న ఈ సంస్థ వ‌ల్ల వేలాది మందికి ఉపాధి దొర‌క‌నుంద‌ని చంద్ర‌బాబు తెలిపారు.

ఇప్ప‌టికే ఏపీకి ప‌లు ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీలు వ‌చ్చాయ‌ని, త్వ‌ర‌లోనే అశోక్ లేల్యాండ్, భారత్ ఫోర్జ్ రాబోతున్నాయని చంద్ర‌బాబు చెప్పారు. టీవీఎస్ బ్రేక్స్ కంపెనీ త‌న కార్యకలాపాలను మొద‌లుబెట్ట‌నుంద‌న్నారు. మరిన్ని కంపెనీలు రాబోతున్నాయ‌ని, రాయలసీమను ఆటోమొబైల్స్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామ‌ని అన్నారు. దాదాపు రూ.35 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, పెట్టుబ‌డులు పెట్టే సంస్థలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నీటి కొరత లేదని, నిరంత‌ర విద్యుత్ సరఫరా ఉంద‌ని తెలిపారు. ఏపీలో ఇప్పటికే 13 లక్షల 75 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని ఉద్యోగాల క‌ల్ప‌న కోసం అహ‌ర్నిశ‌లు కృషి చేస్తామ‌ని, మరిన్ని కంపెనీల‌ను సంప్ర‌దించేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు.

అయితే, గ‌తంలో హీరో కంపెనీ తెలంగాణ‌లో ప‌రిశ్ర‌మ‌ను నెల‌కొల్పాల‌ని చూసింది. దాదాపు ఫైన‌ల్ అనుకున్న స‌మ‌యంలో క‌ర్ణాట‌క ఆ ప్రాజెక్టును ఆక‌ర్షించింది. కానీ ఆ రెండు రాష్ట్రాలను వెన‌క్కు నెట్టి ఏపీకి ఆ ప్రాజెక్టు ద‌క్కేలా చంద్ర‌బాబు వేసిన వ్యూహాలు మొత్తానికి ఫ‌లించాయి. ఈరోజు శంకుస్థాప‌న జ‌ర‌గ‌డంతో ఒక పెద్ద క‌ల నెర‌వేరిన‌ట్ల‌యింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు