టార్గెట్ థ‌ర్డ్ ఫ్రంట్‌..న‌ల్ల‌గొండ నుంచి కేసీఆర్‌

టార్గెట్ థ‌ర్డ్ ఫ్రంట్‌..న‌ల్ల‌గొండ నుంచి కేసీఆర్‌

జాతీయ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు రావాల్సి ఉంద‌ని, కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర స‌ర్కారుకు భిన్నంగా ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల‌ని టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  నదీ జలాల సమస్య.. దశాబ్దాలు గడిచినా రాష్ట్రాల మధ్య జల వివాదాలను కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరించకుండా ఢిల్లీలో కూచుని తమాషా చూస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ నేప‌థ్యంలో ఆ రెండు పార్టీల‌కు దూరంగా ప్రాంతీయ పార్టీల‌తో కూడిన తృతీయ కూటమికి నాయకత్వం వహిస్తానని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించడం అన్నివ‌ర్గాల్లోనూ ఆస‌క్తిని రేకెత్తించింది. ఈ ప్ర‌క‌ట‌న‌తో మరోసారి ఉద్యమనేతగా ఆవిర్భవించబోతున్నారు. దీంతో స‌హ‌జంగానే కేసీఆర్ ఎంపీగా పోటీచేయ‌నున్నార‌నే చ‌ర్చ మొద‌లైంది.

పార్ల‌మెంటు మెట్లు ఎక్కేందుకు కేసీఆర్ ఎక్క‌డినుంచి పోటీ చేయ‌నున్నార‌నే చ‌ర్చ‌లోకి అనూహ్యంగా న‌ల్ల‌గొండ నియోజ‌క‌వ‌ర్గం తెర‌మీద‌కు వ‌చ్చింది. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పినేత జానారెడ్డి, సీఎల్‌పి ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ, మాజీ పార్లమెంట్‌ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి లాంటి ముఖ్య నేతలంతా ఉమ్మడి నల్గొండలోనే ఉన్నారు.

ఈ నేపధ్యంలో నల్గొండ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపీగా పోటీచేస్తే 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రభావం చూపవచ్చుననే ఆలోచనతో ఇక్కడ నుంచే పోటీ చేసేందుకు గురి పెట్టినట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇదే నిజ‌మ‌ని జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒక‌రు వెల్ల‌డించారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీ చేసే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.

మీడియాతో ఇష్టాగోష్టిగా వేముల వీరేశం మాట్లాడుతూ జాతీయ రాజకీయాలకు సీఎం కేసీఆర్‌ వెళుతున్నందున, నల్లగొండ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసే అవకాశం లేకపోలేదన్నారు. ఇక నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పతనం ఎప్పుడో ఆరంభమైందన్నారు. కోమటిరెడ్డి చేసేవన్నీ దొంగ దీక్షలు, దొంగ నాటకాలని అన్నారు. ఉపఎన్నికలు ఆపాలని కాంగ్రెస్‌ నేతలు కోర్టును ఆశ్రయించినప్పుడే వారికి గెలుపుపై నమ్మకం పోయిందన్నారు. కోమటిరెడ్డి గన్‌మెన్ల ఉపసంహరణ వెనుక ఎలాంటి రాజకీయమూ లేదన్నారు. అక్కడ ఉప ఎన్నికలు ఎప్పుడొచ్చినా భూపాల్‌రెడ్డే టీఆర్ఎస్‌ అభ్యర్థి అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఓడిపోవడం ఖాయమని వీరేశం జోస్యం చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు