మోడీ.. అమిత్ షాలు ఉలిక్కిప‌డేలా చేశాడు

మోడీ.. అమిత్ షాలు ఉలిక్కిప‌డేలా చేశాడు

ఎగిసి ప‌డే కెర‌టం ఎంత ఎత్తుకు ఎగిసినా.. అంతిమంగా కింద‌కు దిగాల్సిందే. ఇది ప్ర‌కృతి ధ‌ర్మం. అంతేనా.. ఎంత‌టి మొన‌గాడైనా.. విజ‌యం ఎలా వ‌స్తుందో.. అలానే అప‌జ‌యం వెంటాడుతుంది. కీర్తి ప్ర‌తిష్ఠ‌లు సొంతం చేసుకున్న ఎంతోమంది త‌ర్వాతి కాలంలో అప‌కీర్తిని మూట‌గ‌ట్టుకున్న చ‌రిత్ర‌ను మ‌ర్చిపోకూడ‌దు. జ‌న‌నేత‌గా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో రిజిష్ట‌ర్ అయ్యే నేతలు.. కాలానికి అతీతంగా అదే తీరులో ఉండిపోయిన వారు చాలా త‌క్కువ‌గా కనిపిస్తారు.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు మోడీ మీద కూడా ఇలాంటి అంచ‌నాలే వ్య‌క్త‌మ‌య్యాయి. ఆయ‌నకు కానీ అధికారం చేతికి వ‌స్తే.. మ‌ళ్లీ ప‌దేళ్ల పాటు తిరిగి చూడాల్సిన అవ‌స‌రం లేద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌య్యాయి. మ‌రికొంద‌రు మాత్రం.. మూడు ట‌ర్మ్ లు మోడీవేన‌ని చెప్పారు. ఈ ప్ర‌భ దాదాపుగా మొన్న‌టి వ‌ర‌కూ సాగింది. ఎప్పుడైతే ఆయ‌న‌లో అహంభావం అంత‌కంత‌కూ పెర‌గ‌టం.. సొంత పార్టీ నేత‌ల్ని సైతం లెక్క చేయ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టంతో మోడీ తీరుపై ఆగ్ర‌హం హైపిచ్‌ కు చేరింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే త్రిపురలో పార్టీ విజ‌యం సాధించిన వేళ‌.. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా బీజేపీ నేత ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా ప్ర‌ధానితో స‌హా బీజేపీ నేత‌లంతా త్రిపుర‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ కురువృద్ధుడు అద్వానీ వైపు క‌న్నెత్తి చూసేందుకు సైతం ఇష్ట‌ప‌డ‌ని మోడీ తీరు దేశంలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు రావ‌ట‌మే కాదు.. ఆయ‌న తీరును అంద‌రూ త‌ప్పు ప‌ట్టిన వారే. అద్వానీనే లేకుండా మోడీ లేడ‌న్న‌ది నిజం. త‌న రాజ‌కీయ భ‌విత‌కు  పునాది వేసిన వ్య‌క్తి విష‌యంలో మోడీ అనుస‌రించిన తీరును ఎవ‌రూ హ‌ర్షించ‌లేక‌పోయారు.

ఇదిలా ఉండ‌గా.. ఏపీ రాజ‌కీయాల్లో మార్పులు చోటు చేసుకోవ‌టం.. అంత‌లోనే యూపీ.. బిహార్ రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. బీజేపీకి కంచుకోట లాంటి గోర‌ఖ్ పూర్ స్థానాన్ని చేజార్చుకోవ‌టం దేశ వ్యాప్తంగా మోడీ ఇమేజ్ మ‌స‌క‌బారిందని చెప్ప‌టానికి నిద‌ర్శ‌నంగా ప‌లువురు విశ్లేషించారు.

ఇలా దెబ్బ మీద దెబ్బ త‌గులుతున్న మోడీకి.. తాజాగా మ‌రో షాక్ త‌గిలింది. ఆ పార్టీ ఐటీ సెల్ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌ద్యుత్ బోరా బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ క‌మిటీకి.. ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  దేశ వ్యాప్తంగా బీజేపీ విస్త‌రించ‌టానికి బోరా కీల‌క భూమిక పోషించారు. అలాంటి ఆయ‌న‌..పార్టీకి రాజీనామా చేస్తూ బాంబు లాంటి వ్యాఖ్య‌లు చేశారు.

పార్టీలోనూ.. ప్ర‌భుత్వంలోనూ ప్ర‌జాస్వామ్య సంప్ర‌దాయానికి తూట్లు పొడవ‌టంపై తాను క‌ల‌త చెందిన‌ట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. మిగిలిన పార్టీల‌కు బీజేపీకి పెద్ద తేడా లేక‌పోయింద‌న్న ఆయ‌న మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు రాసిన లేఖ‌లో.. పార్టీ సాగిస్తున్న ప్ర‌స్తుత విధానాల‌తో త‌న‌కు బీజేపీ మీద ఉన్న న‌మ్మ‌కాలు పోయిన‌ట్లుగా వెల్ల‌డించారు. అమిత్ షాకు రాసిన నాలుగు పేజీల లేఖ‌లో ప్ర‌ధాని మోడీ.. అమిత్ షాల ప‌నితీరుపై ఇబ్బందిక‌ర ప్ర‌శ్న‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని చెప్ప‌టం చూస్తే.. మోడీ ప్ర‌భ దేశంలో ఎలా ఉంద‌న్న విష‌యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా చెప్పిన‌ట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు