చిన్న‌మ్మ క్లారిటీ..అమ్మ విష‌యంలో అలా చేసింది నేనే

చిన్న‌మ్మ క్లారిటీ..అమ్మ విష‌యంలో అలా చేసింది నేనే

అన్నాడీఎంకే అధినేత్రి, త‌మిళుల అమ్మ దివంగ‌త జ‌య‌ల‌లిత మ‌ర‌ణం ఎపిసోడ్‌లో కీల‌క స‌మాచారం తెరమీద‌కు వ‌చ్చింది. జయలలిత మరణంపై ఆమె నెచ్చెలి శశికళ స్పందించారు. ఆమె మృతిపై విచారణ జరుపుతున్న కమిషన్‌కు కీలక వివరాలు అందించారు. జయలలిత మృతిపై విచారణ కోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ముగస్వామి కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భర్త చనిపోవడంతో జైలు నుంచి పెరోల్ మీద బయటకు వచ్చిన శశికళ.. కమిషన్ ముందు హాజరయ్యారు. ఆ రోజు జయలలితను ఇంటి నుంచి ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందన్న విషయాలను ఆమె వెల్లడించారు.

2016, డిసెంబర్ 5న జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. ఆస్ప‌త్రిలో చేరే ముందు అస‌లేం జ‌రిగిందో వివ‌రిస్తూ `ఆ రోజు ఉదయం బ్రష్ చేసిన తర్వాత బాత్‌రూమ్‌లోనే తనకు ఏదో సమస్యగా అనిపిస్తున్నదని జయలలిత చెప్పారు. దీంతో ఆమెను నేనే తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టాను. అక్కడే జయలలిత స్పృహ కోల్పోయారు. దీంతో అపోలో ఆసుపత్రి వైద్యులను ఇంటికి పిలిపించాను. స్ట్రెచర్‌పై ఆమెను అలాగే అంబులెన్స్‌లోకి తీసుకెళ్లాం. దారిలో ఆమెకు మెలకువ వచ్చి ఎక్కడికి వెళ్తున్నాం అని అడగటంతో ఆసుపత్రికి అని చెప్పాను. ఆమె వద్దని వారించింది. అయినా ఆసుపత్రికి వెళ్తేనే మంచిదని చెప్పి ఆమెను తీసుకెళ్లాను` అని శశికళ కమిషన్‌కు తెలిపింది.

2014 సెప్టెంబర్‌లో అక్రమాస్తుల కేసులో దోషిగా తేలినప్పటి నుంచి జయలలిత ఆరోగ్యం క్షీణించినట్లు శశికళ చెప్పింది. నవంబర్ 2014 నుంచి సెప్టెంబర్ 2016 మధ్య జయలలితకు చికిత్స అందించిన 20 మంది డాక్టర్ల వివరాలను ఆమె కమిషన్‌కు అందించింది. వీళ్లంతా ఇప్పుడు చెన్నై, ముంబై, కోల్‌కతాల్లోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. ఆసుపత్రిలో ఎవరినీ కలవనీయలేదన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఆ సమయంలో గవర్నర్ విద్యాసాగర్‌రావు, అన్నాడీఎంకే నేతలు పన్నీరుసెల్వం, తంబిదురై, విజయ్ భాస్కర్ ఆమెను కలిశారని శశికళ తెలిపింది. అయితే జయలలితను కలవడానికి తమకు అనుమతివ్వలేదని గతంలో పన్నీరుసెల్వం, తంబిదురై ఆరోపించిన విషయం తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English