సీఎం అయ్యే ఛాన్స్ ను ప‌వ‌న్ మిస్ చేసుకుంటున్నారా?

సీఎం అయ్యే ఛాన్స్ ను ప‌వ‌న్ మిస్ చేసుకుంటున్నారా?

బంప‌ర్ ఛాన్స్ ను ప‌వ‌న్ చేజేతులారా మిస్ చేసుకుంటున్నారా?  ఏపీకి ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశాన్ని ప‌వ‌న్ చేస్తున్న త‌ప్పులు రాజ‌కీయంగా ఆయ‌న‌కు భారీ న‌ష్టాన్ని చేయ‌నున్నాయా? అంటే అవున‌ని చెబుతున్నారు. రాజ‌కీయాల్లో ఏ మాత్రం ప‌డ‌ని ప‌డ‌గ నీడ‌లు ఏమైనా ఉన్నాయంటే అవి రెండే రెండు ఒక‌టి అహంకారం అయితే రెండోది అప‌న‌మ్మ‌కం. పార్టీ నేత‌ల‌తో కానీ ప్ర‌జ‌ల‌తో కానీ ఈ రెండు విష‌యాల్లో చేసే త‌ప్పులే స‌ద‌రు రాజ‌కీయ అధినేత ఫ్యూచ‌ర్ ను తేలుస్తాయ‌ని చెబుతారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీలో కీల‌క భూమిక పోషించే అవ‌కాశం ప‌వ‌న్ కు ఉంది. విభ‌జ‌న నేప‌థ్యంలో పుట్టెడు అప్పులు చంద్ర‌బాబు స‌ర్కారుకు ఎన్ని ఇబ్బందుల‌కు గురి చేశాయో తెలియంది కాదు. అన్నింటికి మించి అస్స‌లు మ‌ర్చిపోకూడ‌ని మ‌రో విష‌యం ఏమిటంటే.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ ప‌దేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంగా ఉంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

ప‌దేళ్ల పాటు ఒక పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. ఆయ‌న ఇచ్చే క‌మిట్ మెంట్స్ చాలానే ఉంటాయి. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏన్నో కొన్ని చేయాల్సిన ప‌నులు ఉంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో రాజీ ప‌డ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. కానీ.. కొత్త పార్టీకి ఇలాంటి ఇబ్బందులు ఉండ‌వు. ఇక‌..ఏపీ విప‌క్ష నేత‌కున్న ఇమేజ్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పీక‌ల్లోతు అవినీతి ఆరోప‌ణ‌ల్లో.. నేటికి ప్ర‌తి వారం కోర్టుకు హాజ‌ర‌య్యే ప‌రిస్థితి. దీనికి తోడు ఆయ‌న‌కు ఆభ‌ర‌ణంగా ఉండే అహంకారం అంతా ఇంతా కాదు.

ఆయ‌న‌లోని అహంకారాన్ని సొంత‌పార్టీ నేత‌లు సైతం స‌హించ‌లేక‌పోతార‌ని.. ప్ర‌త్యామ్నయం లేక కామ్ గా ఉంటార‌ని చెబుతారు. జ‌గ‌న్ లోని నెగిటివ్ ఫ్యాక్ట‌ర్స్ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లిపోయాయి. దీంతో.. ఆయ‌న్ను న‌మ్మే వారి కంటే న‌మ్మ‌ని వారే ఎక్కువ‌గా చెప్పాలి. దీంతో.. 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కున్న అవ‌కాశాలు అంతంతే. ఇక‌.. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి త‌న‌కున్న  ప‌రిమితుల నేప‌థ్యంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఏ్ర్ప‌డింది.

జాతీయ స్థాయిలో బ‌లంగా ఉన్న మోడీతో సున్నం పెట్టుకుంటే రాష్ట్రానికి జ‌రిగే న‌ష్టం.. అనుభ‌వం ఉన్న ముఖ్య‌మంత్రిగా ఆయ‌న‌కు తెలుసు. దీనికి తోడు చంద్ర‌బాబులో స‌హ‌జంగా ఉండే తొంద‌ర‌ప‌డ‌ని త‌త్త్వం కూడా  హోదా సాధ‌న విష‌యంలో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోయింద‌ని చెప్పాలి.

ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు జ‌నంలోనే ఉండాల‌ని.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో చురుగ్గా ఉండాల‌ని ఆశించిన ప‌వ‌న్‌.. ముంద‌స్తు క‌స‌ర‌త్తులో భాగంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని రంగంలోకి దిగిన‌ట్లుగా చెబుతారు. ప‌వ‌న్ లాంటోడు సీన్లోకి వ‌స్తే జ‌రిగే న‌ష్టాన్ని ఊహించిన బీజేపీ పెద్ద‌లు.. ఆయ‌న‌కు చెక్ చెప్పేందుకు వీలుగా ఒక వ్యూహాన్ని సిద్ధం చేసిన‌ట్లు చెబుతారు.

ప‌వ‌న్ కు సంబంధించిన కీల‌క అంశాల‌కు సంబంధించి ఆయ‌న ముందుకు.. వెన‌క్కి వెళ్ల‌లేని ప‌రిస్థితులు క‌ల్పించిన‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇందులో నిజం మాట ఎంత‌న్న‌ది ప‌వ‌న్ కే తెలియాలి. కాకుంటే.. వారి వాద‌న‌ను నిజం చేస్తూ ప‌వ‌న్ తీరు ఉండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ప్యాకేజీ విష‌యంపై పాచిపోయిన ల‌డ్డూలు ఇస్తారా? అంటూ ద‌మ్ముగా నిల‌దీసిన ప‌వ‌న్‌.. తాజాగా ఏర్పాటు చేసిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో మాత్రం మోడీపై ప‌ల్లెత్తు మాట అన‌లేదు.

అంతేనా.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్త‌ట‌మే కాదు.. ఆయ‌న కుమారుడు క‌మ్ ఏపీ మంత్రి లోకేశ్ పై తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో.. ఏపీ రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. హోదా కోసం ప‌వ‌న్ గ‌ళం విప్పుతార‌ని..అవ‌స‌ర‌మైతే ఢిల్లీ గ‌ల్లీలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తార‌న్న అంచ‌నాల‌కు భిన్నంగా.. పేరు ఏదైతేనేం.. నిధులు వ‌స్తే చాలు అంటూ ప‌వ‌న్ నోటి నుంచి వ‌చ్చిన మాట‌ల‌తో.. ప‌వ‌న్ ఢిల్లీ బాస్ కు వీర విధేయుడిగా మారార‌న్న‌ది క‌న్ఫ‌ర్మ్ అయ్యింది.

ఒక జాతీయ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాను చెప్పిన మాటతో రేగిన క‌ల‌క‌లంతో అలెర్ట్ అయిన ప‌వ‌న్‌.. తాను చెప్పిన మాట‌ల్ని స‌ద‌రు ఛాన‌ల్ జ‌ర్న‌లిస్ట్ స‌రిగా అర్థం చేసుకోలేద‌ని స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేసినా.. అదేమీ నిజం కాదు.. ప‌వ‌న్ మాట‌లు ఇదిగో అంటూ బాబుకు మ‌ద్దతుగా నిలిచే మీడియా సంస్థ‌లు వార్త‌లు ఇచ్చేసిన ప‌రిస్థితి. ఇది స‌రిపోద‌న్న‌ట్లుగా మ‌రో జాతీయ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఏపీ ప్ర‌జ‌లు మోడీకి వ్య‌తిరేకంగా ఉన్నార‌ని.  త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా మోడీ అంటే అభిమాన‌మంటూ చేస్తున్న ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ఆయ‌న ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీశాయి. తాను మాట్లాడే ప్ర‌తి మాటా ఆచితూచి మాట్లాడ‌తాన‌ని చెప్పే ప‌వ‌న్‌.. అందుకు భిన్నంగా నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడుతున్న వైనం ఇప్పుడు ఆయ‌న వీరాభిమానులు సైతం జీర్ణించుకోలేక‌పోతున్నారు.

రోజుల వ్య‌వ‌ధిలో ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు.. ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును ప్ర‌భావితం చేస్తాయ‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తించ‌లేక‌పోతున్నార‌న్న ఆవేద‌న వినిపిస్తోంది. ఒక‌వేళ‌.. రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్న‌ట్లుగా ప‌వ‌న్ కు సంబంధించిన గుట్టుమ‌ట్లు మోడీ చేతికి చిక్కి.. దానికి సంబంధించిన సంకేతాలు వ‌చ్చిన ప‌క్షంలో.. అలాంటి వాటికి ధీటుగా రియాక్ట్ కావాలే త‌ప్పించి.. బేల‌గా ఇలా డ‌బుల్ స్టాండ్ అస్స‌లు ప‌నికి రాద‌న్న మాట వినిపిస్తోంది.

ఒక‌వేళ‌.. ప‌వ‌న్ కు సంబంధించిన కీల‌క అంశాల్ని సాకుగా చూపించి ఆయ‌న‌పై కేసులు పెట్టే ప్ర‌య‌త్నాన్ని కేంద్రం చేసినా.. అదంతా హోదా కోసం ప‌వ‌న్ చేస్తున్న పోరాటంతో ఆయ‌న్ను ఇబ్బంది పెట్టేందుకు.. క‌క్ష సాధింపు చ‌ర్య‌లుగా మోడీ స‌ర్కారు చేస్తుంద‌న్న మాట‌ను ఏపీ ప్ర‌జ‌లు భావించ‌టం ఖాయం. అలాంటివేళ‌.. మోడీని ఏపీ ప్ర‌జ‌లు మ‌రింత అస‌హ్యించుకోవ‌టం ఖాయం. ఒక‌వేళ‌.. అలాంటి క‌క్ష సాధింపు చ‌ర్య‌లు చేప‌డితే ప‌వ‌న్ రానున్న ఎన్నిక‌ల్లో కీల‌కంగా మార‌ట‌మే కాదు.. సానుభూతితో భారీ ఎత్తున సీట్లు సొంతం చేసుకునే వీలుంది. అదే జ‌రిగితే.. ప్ర‌త్యేక సంద‌ర్భంలో ఆయ‌న ఏపీకి ముఖ్య‌మంత్రిగా అయ్యే అవ‌కాశం లేక‌పోలేదు.

అందుకు భిన్నంగా బేల‌గా మారి మోడీ అడుగుల‌కు మ‌డుగులు ఒత్త‌టం ద్వారా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై చెర‌గ‌ని మ‌చ్చ వేయించుకోవ‌టంతో పాటు.. ఏపీకి సీఎం అయ్యే అరుదైన అవ‌కాశాన్ని మిస్ అవుతున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. ఈ విష‌యాన్ని రాజ‌కీయ అనుభ‌వం పెద్ద‌గా లేని ప‌వ‌న్ గుర్తించ‌క‌పోవ‌టం ఓకే. కానీ.. ఆయ‌నకు రాజ‌కీయ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించే వారెందుకు ఆలోచించ‌టం లేద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు కార‌ణం అవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు