నాకు ఒక్క ఫోన్ చేస్తే స‌రిపోయేది ప‌వన్: లోకేశ్

నాకు ఒక్క ఫోన్ చేస్తే స‌రిపోయేది ప‌వన్: లోకేశ్

గుంటూరులో జరిగిన జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ‌ స‌భ సంద‌ర్భంగా టీడీపీపై ప‌వ‌న్ క‌ల్యాణ్ మండిప‌డ్డ సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్ అవినీతిపై ప‌వ‌న్ నిప్పులు చెరిగారు. శేఖ‌ర్ రెడ్డి కేసులో లోకేశ్ పేరుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, చంద్ర‌బాబుకు ఈ విష‌యం తెలిసినా స్పందించ‌లేద‌ని ప‌వ‌న్ ఆరోపించారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను చంద్ర‌బాబు స‌హా ప‌లువురు టీడీపీ నేత‌లు ఖండించారు.

ఇన్నాళ్లూ టీడీపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న ప‌వ‌న్....బీజేపీ చెప్పుడు మాట‌లు విని ఈ విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆరోపించారు. తాజాగా, ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై లోకేశ్ స్వ‌యంగా స్పందించారు. త‌మ‌తోపాటు ప‌వ‌న్ నాలుగేళ్లు క‌లిసి ప్ర‌యాణం చేశార‌ని, రాత్రికిరాత్రే ప‌వ‌న్ ప్లేటు ఫిరాయించి త‌న‌పై నింద‌లు వేయడం స‌రికాద‌ని అన్నారు. తాను అవినీతికి పాల్పడ్డానని ప‌వ‌న్ ఆరోపిస్తున్నార‌ని, ఆ అవినీతికి సంబంధించి ప‌వ‌న్ ద‌గ్గ‌ర ఉన్న స‌మాచారం గురించి  త‌న‌తో మాట్లాడ‌వ‌చ్చు క‌దా అని ప్ర‌శ్నించారు.

పవన్ కు త‌న‌ మొబైల్‌ నంబర్‌ కూడా తెలుసని, అటువంటపుడు ఆయ‌న ఫోన్ చేయ‌వ‌చ్చు కదా అని ప్ర‌శ్నించారు. అమరావతిలోని టీడీఎల్పీలో మంగళవారం మీడియాతో మాట్లాడిన లోకేశ్‌...ఈ వ్యాఖ్య‌లు చేశారు.

వాస్త‌వానికి ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై లోకేశ్ ఆలస్యంగా స్పందించారు. ఎట్ట‌కేల‌కు మంగ‌ళ‌వారం నాడు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు దీటుగా జ‌వాబిచ్చేందుకు మంత్రిగారు ప్ర‌య‌త్నించారు. శేఖర్‌రెడ్డి అక్రమాలతో త‌న‌కు సంబంధాలున్నాయని పవన్ ఆరోపిస్తున్నార‌ని, అటువంటి నిరాధారమైన ఆరోపణలకు తాను సమాధానం చెప్పాలా? అంటూ లోకేశ్ ప్ర‌శ్నించారు. పవన్‌ ద్వంద్వ వైఖరి బయటపడింద‌ని, ప‌వ‌న్ దుమ్మెత్తిపోస్తే తాను దులుపుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు.

శేఖర్ రెడ్డితో త‌న‌కు సంబంధాలున్నాయని ఒక‌సారి, ఎవరో త‌న‌తో చెబితే అలా అన్నాన‌ని మ‌రోసారి ప‌వ‌న్ మీడియాలో చెప్పార‌ని లోకేశ్ ఎద్దేవా చేశారు. నిజంగా పవన్‌ దగ్గర ఆధారాలుంటే ఇలా రెండు నాల్క‌ల ధోర‌ణిలో మాట్లాడి ఉండేవారు కాద‌ని, త‌న‌కు ఒక్క ఫోన్ చేసి వివర‌ణ అడిగితే స‌రిపోయేద‌ని లోకేశ్ అన్నారు. తాను పుట్టేనాటికే త‌న తాత ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారని....చాలా పద్ధతిగా, క్రమశిక్షణతో పెరిగిన తాను తాత పరువుతీశానని ఆరోపించ‌డం దారుణ‌మని లోకేశ్ అన్నారు. త‌న తండ్రి చంద్ర‌బాబు రాష్ట్రం కోసం రాత్రింబ‌వ‌ళ్లు కష్టపడుతున్నారని, ఆయనకే రేటింగ్‌ ఇచ్చే స్థాయికి పవన్ ఎదిగారా ?’ అని లోకేశ్...ప‌వ‌న్ పై మండిప‌డ్డారు. మ‌రి, లోకేశ్ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు