`ఫెడ‌ర‌ల్ ఫ్రంట్` పై కేసీఆర్ తొలి అడుగు...

`ఫెడ‌ర‌ల్ ఫ్రంట్` పై కేసీఆర్ తొలి అడుగు...

దేశ ప్ర‌జ‌లు నాయ‌క‌త్వ మార్పు కోరుకుంటున్నార‌ని, త్వ‌ర‌లోనే భావ సారూప్యం ఉన్న పార్టీల‌తో క‌లిసి థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని తెలంగాణ సీఎం కేసీఆర్....కొద్ది రోజుల క్రితం చేసిన ప్ర‌క‌ట‌న దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌క‌ట‌న అనంతరం....కేసీఆర్ కు ప‌లు పార్టీల అధినేత‌లు మ‌ద్ద‌తు కూడా ప్ర‌క‌టించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యేందుకు కేసీఆర్ సోమవారం కోల్ క‌తా వెళ్లారు. సెక్రటేరియట్‌ వద్ద కేసీఆర్ కు ఘ‌న స్వాగతం పలికిన మమతా....కేసీఆర్ తో కొత్త ఫ్రంట్ ఏర్పాటుపై దాదాపు రెండు గంట‌ల‌పాటు చర్చించారు. ఆ త‌ర్వాత వారిద్ద‌రూ మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశానికి ఒర‌గ‌బెట్టిందేమీ లేద‌ని, దేశ ప్రజలు ప్ర‌త్యామ్నాయ ఫ్రంట్ కోరుకుంటున్నారని అన్నారు.

తమది థర్డ్ ఫ్రంట్ కాదని, ఫెడరల్ ఫ్రంట్ అని, ప్ర‌స్తుతం దేశానికి బ‌ల‌మైన ఫెడరల్ ఫ్రంట్ అవసరం ఉంద‌ని కేసీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఒక‌తాటిపైకి తెచ్చే ప్ర‌య‌త్నంలో భాగంగానే నేడు మ‌మ‌తా బెన‌ర్జీతో భేటీ అయ్యాన‌ని, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు ఇదే తొలి అడుగ‌ని అన్నారు. 2019 ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి మమతా బెనర్జీతో చర్చించామని, పశ్చిమబెంగాల్ ను మమత అభివృద్ధి చేసిన తీరుపై ప్ర‌శంస‌లు కురిపించారు.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు ప‌రిస్థితులను బ‌ట్టి ఎవ‌రో ఒక‌రు నాయ‌క‌త్వం వ‌హిస్తార‌ని విలేక‌రుల‌డిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో సమష్టి నాయకత్వం....ఫెడరల్ లీడర్‌షిప్ ఉంటుంద‌న్నారు. రొటీన్ కు భిన్నంగా ఫెడరల్ ఫ్రెంట్ ఉంటుందని, ప్రజల ఎజెండానే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఎజెండా అని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈ చర్చలు ఆరంభం మాత్రమేనని, మ‌మ‌త‌తో చర్చలు సంతృప్తికరంగా సాగాయని అన్నారు.

చైనాలాంటి దేశాలతో భార‌త్ ఎందుకు పోటీపడలేకపోతోంద‌ని, సిలికాన్ వ్యాలీలో 60శాతం మంది భార‌తీయులేన‌ని, దేశ యువతలో ఎంతో ప్రతిభ దాగుందని అన్నారు. త్వ‌ర‌లోనే భ‌విష్యత్‌ కార్యాచరణ ప్ర‌క‌టిస్తామ‌ని, ఇది అంతం కాదు...ఆరంభం మాత్రమేన‌ని స్ప‌ష్టం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పై ఇతర పార్టీల అధినేతలతో కూడా చర్చిస్తాన‌ని కేసీఆర్ తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ చేస్తోన్న‌ ప్రయత్నాలను మమతా బెనర్జీ స్వాగతించారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఇది తొలి అడుగ‌ని, ఇది  శుభారంభమ‌ని మ‌మ‌త అన్నారు. రాజకీయాలనేవి నిరంతర ప్రక్రియ అని, తాము దేశాభివృద్ధే లక్ష్యంగా చర్చ‌లు జ‌రిపామ‌ని అన్నారు. బలమైన ఫెడరల్ ఫ్రంట్ ను తాము కోరుకుంటున్నామనని, రొటీన్ కు భిన్నంగా త‌మ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్  ఉంటుందని మ‌మ‌తా బెన‌ర్జీ స్ప‌ష్టం చేశారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ తో కలిసి ప‌ని చేసేందుకు ముందుకు వచ్చే మిగిలిన పార్టీలను క‌లుపుకుంటామ‌ని, ఒకే పార్టీ దేశాన్నిఏళ్ల త‌ర‌బ‌డి పాలించాల‌ని అనుకోవ‌డం స‌రికాద‌ని ఆమె వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English