చంద్రబాబు, కేసీఆర్ కలిస్తే ప్రభంజనమేనా?

చంద్రబాబు, కేసీఆర్ కలిస్తే ప్రభంజనమేనా?

తెలుగు రాష్ట్రాల కేంద్రంగా జాతీయ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ కూటమి కడతానని ప్రకటించడంతో మొదలై.. ఆ తరువాత చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు రావడంతో మరింత వేడెక్కాయి రాజకీయాలు. ఇప్పుడు కేసీఆర్ దాన్ని మరింత వేగం పెంచేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీతో కలిసి వెళ్లాలా.. లేదంటే తాము సొంతంగా కదలాలా అనే విషయంలో తేల్చుకునేందుకు పార్టీ నేతలతో ఆయన సమావేశమవుతున్నారు.

కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ, వైసిపి ప్రతిపాదించిన అవిశ్వాసం విషయంలో ఎలా వ్యవహరించాలన్నదానిపై పార్టీ ముఖ్యు లతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చర్చిస్తున్నారు. ప్రత్యేకహోదా అంశంపై ఇప్పటికే పార్లమెంట్‌ సాక్షిగా టిఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటించగా, తాజా రాజకీయ పరిణామాలపై అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో సిఎం మాట్లాడుతున్నారు. ఆదివారం అందుబాటులో ఉన్న ఎంపీలను ప్రగతిభవన్‌ రమ్మని కోరినట్లు సమాచారం. ప్రత్యేకహోదా అంశానికి టిఆర్‌ఎస్‌ మద్దతునిస్తుందని, అవిశ్వాసానికి మద్దతునివ్వాలా లేదా అన్నఅంశంపై ఇంకా పార్టీ నిర్ణయం తీసుకోలేదని పార్టీకి చెందని ఎంపీలు చెబుతున్నారు. అవిశ్వాసం విషయంలో కెసిఆర్‌ నిర్ణయం తీసుకుంటారని శనివారం కవిత చెప్పారు. అవిశ్వాసంపై జరిగే చర్చలో పాల్గొని.. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు, రిజర్వేషన్ల అంశంపై వాదనలు వినిపించాలని టిఆర్‌ఎస్‌ భావిస్తోంది.

కాగా అవిశ్వాసంపై చర్చ జరిగి.. డివిజన్‌ జరిగే పరిస్థితి ఉంటే అప్పటి వాతావరణాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామని, ఈ లోగా మరిన్ని రాజకీయ మార్పులు జరిగే అవకాశం ఉందని టిఆర్‌ఎస్‌ భావిస్తోంది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కెసిఆర్‌ కోల్‌కతా వెళ్ళి మమతాబెనర్జీతో భేటీ కానుండగా, ఆమె సూచనలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా చురుకుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్ణయించారు. టీడీపీతో కలవాలా వద్దా అనే నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కీలకంగా మారనుందని భావిస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు