బాబుఫైర్ః ఎదురుచూశా...మోసం చేశారు..అందుకే వ‌దిలేశా

బాబుఫైర్ః ఎదురుచూశా...మోసం చేశారు..అందుకే వ‌దిలేశా

ఎన్డీఏలో నుంచి తానెందుకు బ‌య‌ట‌కు వ‌చ్చిందో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సుదీర్ఘంగా వివ‌రించారు. శాస‌న‌మండ‌లిలో సుదీర్ఘంగా చంద్ర‌బాబు వివ‌రించారు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం ఎదురుచూశానని ప‌ట్టించుకోలేద‌ని..అందుకే ఎన్డీఏను వీడాన‌ని వివ‌రించారు. తాను ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా విభజన చట్టంలో హామీలను అమలు చేయమనే అడిగానని, అది కూడా చేయకపోతే పోరాటం తప్ప మరే మార్గం ఉందని ఆయన ప్రశ్నించారు.

నాలుగేళ్లుగా ఏపీని పట్టించుకోలేదు, గట్టిగా నిలదీస్తే ఎగతాళిగా మాట్లాడారు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అరుణ్ జైట్లీగారు ఇష్టారీతిగా మాట్లాడారని దుయ్యబట్టారు. డిఫెన్స్ బడ్జెట్ అడిగేంత సంస్కారహీనుల్లా కనిపిస్తున్నామా అని నిలదీశారు. సెంటిమెంట్లతో నిధులు రావని అంటారా? ఏం తెలుగువారి సెంటిమెంట్‌ను పట్టించుకోరా అని ప్రశ్నించారు.  తెలుగు సెంటిమెంట్ అంటే అంత చులకనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశాన్ని కాపాడే బాధ్యత మామీద ఉందని అరుణ్ జైట్లీ అన్నారనీ, అంటే మీరొక్కరే దేశాన్ని కాపాడుతున్నారా, ప్రతి భారతీయుడూ దేశ రక్షణ కోసం నడుం బిగిస్తారనీ, మీ కొక్కరికే దేశ భక్తి ఉందని అనుకోకండి అని చంద్రబాబు అన్నారు. మేం అదనంగా ఏమీ అడగడం లేదని చంద్రబాబు అన్నారు.

తాజాగా లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లు ఆమోదించారనీ, తాను నిన్నటి దాకా చూసింది ఫైనాన్స్ బిల్లులో ఏమైనా సవరణలు పెడతారేమోనని చూశాననీ, అటువంటిదేమీ లేకపోవడంతో ఇక తప్పదని ఎన్డీయే నుంచి బయటకు వచ్చామన్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాకానే అవిశ్వాసం పెట్టాలని భావించామని అందుకే ఇప్పుడు కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టామన్నారు. త‌న ప్ర‌యోజనాల కోసం ఎన్డీఏలో చేరలేదని చంద్రబాబు అన్నారు.

విభజన హామీలేవీ కేంద్రం అమలు చేయలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మిత్ర ధర్మం ప్రకారం నాలుగేళ్ల పాటు కేంద్రాన్ని విభజన హామీలను అమలు చేయాలని అడుగుతూ వచ్చామన్నారు. చివరి బడ్జెట్ లో కూడా అన్యాయం చేసేసరికి ఇక తప్పదని పోరాటం ప్రారంభించామన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీలో ప్రచారం కోసం వచ్చిన మోడీ ఏపీకి విభజనలో అన్యాయం జరిగింది…మేం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాకా వారు కూడా ఏపీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయంలో బీజేపీ కూడా భాగస్వామే అని చంద్రబాబు అన్నారు. నాడు రాజ్యసభలో ఏపీ తరఫున మాట్లాడిన వారు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీయేనన్నారు. నాడు విపక్షంలో ఉన్నారు కనుక మాట్లాడారు. అధికారంలోకి వచ్చాకా మర్చిపోయారని విమర్శించారు. మేం ఏదైతే చట్టంలో ఉందో అదే అమలు చేయమని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా కచ్చితంగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు చెప్పారు. అయితే మనకు న్యాయంగా, చట్టబద్ధంగా రావలసిన వాటి గురించే మాట్లాడుతున్నామని, కేంద్రాన్ని నిలదీస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు