బాబు ఫ్యూచ‌ర్ ప్లాన్ పై రిప‌బ్లిక్ టీవీ స్టోరీ

బాబు ఫ్యూచ‌ర్ ప్లాన్ పై రిప‌బ్లిక్ టీవీ స్టోరీ

దేశంలో జ‌ర్న‌లిస్టులు చాలామందే ఉన్నా.. కొంద‌రు స్టార్ జ‌ర్న‌లిస్టులు ఉన్నారు. మ‌రికొంద‌రు సెల‌బ్రిటీ జ‌ర్న‌లిస్టులు ఉన్నారు. స్టార్ ప్ల‌స్ సెల‌బ్రిటీ జ‌ర్న‌లిస్టులు మాత్రం చాలా త‌క్కువ‌మంది ఉంటారు. అలాంటి వారిలో ఒక‌రు అర్నాబ్ గోస్వామి. గ‌తంలో ఒక ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్ లో ప‌ని చేసిన ఆయ‌న‌.. అక్క‌డ తేడా వ‌చ్చాక త‌న‌దైన ఛాన‌ల్ ను స్టార్ట్ చేశారు. రిప‌బ్లిక్ టీవీ పేరుతో ఏర్పాటు చేసిన ఛాన‌ల్ లో ఆయ‌న త‌ర‌చూ సంచ‌ల‌న క‌థ‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తుంటారు.

తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఒక సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌సారం చేశారు. వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల నాటికి వివిధ ప్రాంతీయ పార్టీల‌తో కూడిన ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు ఏపీ సీఎం చంద్ర‌బాబు శ్రీ‌కారం చుట్ట‌నున్న‌ట్లుగా ఒక ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌సారం చేశారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం బాబు నేతృత్వానికి ఏడు పార్టీలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయ‌ని.. మేలో త‌న ఫ్రంట్ ను అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు.

అఖిలేశ్‌.. మాయావ‌తితో మాట్లాడ‌క ఎన్డీయే నుంచి వైదొలిగే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌ద‌రు క‌థ‌నంలో పేర్కొన్నారు. దీనికి త‌గ్గ‌ట్లే ఎన్డీయేతో రాంరాం అన్న విష‌యాన్ని బాబు ప్ర‌క‌టించ‌నున్న విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క‌పాత్ర పోషించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంకేతాలు పంపిన నేప‌థ్యంలో.. బాబు కూడా జాతీయ స్థాయిలో జ‌ట్టుక‌ట్టే ప్ర‌య‌త్నం చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. రిప‌బ్లిక్ టీవీ ఛాన‌ల్ ప్ర‌సారం చేసిన బాబు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై పార్లమెంటు సెంట్ర‌ల్ హాల్లో ఎంపీల మ‌ధ్య చ‌ర్చ‌లు షురూ అయిన‌ట్లుగా చెబుతున్నారు. కూట‌మి ఏర్ప‌డితే చంద్రబాబు త‌ప్ప మ‌రెవ‌రూ సార‌థ్యం వ‌హించ‌లేర‌ని.. గ‌తంలోనూ కూట‌మిని న‌డిపిన  అనుభ‌వం ఆయ‌న‌కు క‌లిసొచ్చే అంశంగా చెబుతున్నారు. చంద్ర‌బాబుపై రిప‌బ్లిక్ టీవీ ఛాన‌ల్ ప్ర‌సారం చేసిన క‌థ‌నం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు