క‌త్తి మ‌హేష్ ప్ర‌మాదంపై డ్రైవ‌రేమ‌న్నాడంటే..


ప్ర‌ముఖ క్రిటిక్ క‌మ్ సోష‌ల్ యాక్టివిస్ట్ క‌త్తి మ‌హేష్ రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ‌టం.. రెండు వారాల పాటు ఆసుప‌త్రిలో చికిత్స పొందాక తుది శ్వాస విడ‌వ‌డం తెలిసిందే. మ‌ధ్య‌లో ఆయ‌న కోలుకున్న‌ట్లుగా వార్తలొచ్చాయి కానీ.. త‌ర్వాత హ‌ఠాత్తుగా మ‌ర‌ణ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఐతే క‌త్తి మ‌ర‌ణంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తూ మందకృష్ణ మాదిగ న్యాయ విచార‌ణ‌కు డిమాండ్ చేయ‌డం, క‌త్తి కుటుంబ స‌భ్యుల నుంచి సైతం అదే డిమాండ్ రావ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రమాదంలో కత్తికి అంతటి తీవ్ర గాయాలు కాగా.. ఆ కారును నడుపుతున్న డ్రైవర్ సురేష్ స్వల్ప గాయాలతో బయటపడటం అనుమానాలు రేకెత్తించిన నేపథ్యంలో అతణ్ని పిలిచి పోలీసులు విచారించారు. కొవ్వూరు పోలీస్ స్టేషన్లో సీఐ ఆధ్వర్యంలో అతడిని విచారించారు. అనంతరం ఈ వివరాలను మీడియాకు కూడా వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం సురేష్ ఏమన్నాడంటే..

ప్రమాదం జరగడానికి కాస్త ముందు నెల్లూరులో ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకున్నామని.. కానీ ఈలోపే ఆ దుర్ఘటన జరిగిందని.. కంటైనర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని సురేష్ చెప్పాడు. యాక్సిడెంట్ జరిగినపుడు కత్తి మహేష్ నిద్రలో ఉన్నాడని.. సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే ఆయన ముందుకు ఢీకొట్టాడని సురేష్ వెల్లడించాడు. ఎయిర్‌ బ్యాగ్స్‌ ఓపెన్‌ అయినప్పటికీ పగిలిన అద్దాల ముక్కలు మహేశ్‌ కంటికి గుచ్చుకున్నాయని.. ఆయనకు రక్తస్రావం అవుతుండటంతో హైవే పెట్రోలింగ్‌ పోలీసుల సాయంతో వెంటనే ఆస్పత్రికి తరలించామన్నాడు.

నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స జరిగాక.. అక్కడ ఐ స్పెషలిస్టు లేకపోవటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రి తరలిచించామన్నాడు. ఈ ప్రమాదంలో మీకేందుకు గాయాలు కాలేదని పోలీసులు అడగ్గా.. తాను సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే గాయాలు కాలేదని సురేశ్‌ సమాధానం ఇచ్చాడని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇచ్చానని.. ఈ కేసులో తనని అనుమానించాల్సిన అవసరం లేదని అన్నాడు. అవసరమైతే మళ్లీ పోలీసుల విచారణకు సహకరిస్తానని చెప్పాడు.