యూపీ నుంచి ఏపీ వరకు బీజేపీకి వార్నింగ్ బెల్స్

యూపీ నుంచి ఏపీ వరకు బీజేపీకి వార్నింగ్ బెల్స్

నాలుగేళ్ల కిందట సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఊపు ఊపి కేంద్రంలో అధికారం అందుకున్న బీజేపీ ఆ తరువాత మరింత దూకుడు ప్రదర్శిస్తూ ఉత్తర ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో మరింత పెద్ద విజయం దక్కించుకుంది. అంతేనా... ఈశాన్యాన అస్సాంలో పాగా వేసింది.. అక్కడి చిన్నచిన్న రాష్ట్రాల్లో పట్టు సాధించుకుంది. కానీ.. మూడేళ్లు దాటాక బీజేపీకి ముచ్చెమటలు పోయిస్తున్నాయి కొన్ని ఘటనలు ముఖ్యంగా అధికారంలో ఉంటూ, పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికల్లో బీజేపీ చతికిల పడుతోంది. దీంతో 2019 ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందా అన్న టెన్షన్ ఆ పార్టీని వెన్నాడుతోంది.  తాజాగా యూపీ ఉప ఎన్నికల్లో దారుణంగా దెబ్బతినడంతో పాటు ఏపీలో చంద్రబాబును దూరం చేసుకుంటుండడంతో బీజేపీకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

ఇటీవలే త్రిపురలో ప్రభుత్వాన్ని స్థాపించి, మేఘాలయ, నాగాలాండ్‌లలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన బీజేపీ  తాజాగా ఉత్తరప్రదేశ్, బీహార్ ఉపఎన్నికల్లో దెబ్బతింది.  మోదీకి వారసునిగా, భవిష్యత్తులో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో బీజేపీ పరాజయం పాలైంది. మరోవైపు ఫుల్‌పూర్‌లో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ బీజేపీ అభ్యర్థి కౌశలేంద్ర సింగ్‌ పటేల్‌పై 59 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ ఎస్పీకి 3,42,796 ఓట్లు లభించగా, బీజేపీకి 2,83,183 ఓట్లు దక్కాయి.

గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎస్పీకి చెందిన ప్రవీణ్ నిషాద్, బీజేపీకి చెందిన ఉపేంద్ర దత్ శుక్లాపై 21,961 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ స్థానంలో ఎస్పీకి 4,56,437 ఓట్లు, బీజేపీకి 4,34,476 ఓట్లు లభించాయి. యోగి ఆదిత్యనాథ్ 2014లో గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో బీజేపీ అఖండ విజయం సాధించటంతో ఆయన ఎంపీ సీటుకు రాజీనామా చేసి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఇప్పుడు గోరఖ్‌పూర్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా.. ఫుల్‌పూర్‌ నియోజకవర్గం నుంచి కేశవ్ ప్రసాద్ మౌర్య 2014లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాత ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులవ్వటంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాలు రెండింటిలోనూ బీజేపీ దెబ్బతింది.

బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికలలో భబువా అసెంబ్లీ స్థానంలో బీజేపీ విజయం సాధించగా, జెహానాబాద్ స్థానాన్ని ఆర్జేడీ గెల్చుకుంది. అరారియా లోక్‌సభ స్థానంలో కూడా ఆర్జేడీ ముందంజలో ఉంది.

అయితే... బీజేపీ పరాజయంపై కాంగ్రెస్ చంకలు గుద్దుకుంటున్నా ఆ పార్టీ పెర్ఫార్మన్సు మాత్రం దారుణంగా ఉంది.  ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్ రెండు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. రీసెంటుగా మాయవతి, అఖిలేశ్ లు జట్టు కట్టడంతోనే బీజేపీ నష్టపోయినట్లు అర్థమవుతోంది.

కొద్దిరోజుల ముందు మధ్య ప్రదేశ్ లో రెండు స్థానాల్లో , రాజస్థాన్ లో మూడు స్థానల్లో ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. ఆ రెండు రాష్ట్రాలూ బీజేపీ పాలిత రాష్ట్రాలే.

కాగా  ప్రస్తుతం దక్షిణాదిలోనూ బీజేపీకి పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. మొన్నటివరకు అనుకూలంగా ఉన్న తెలంగాణ సీఎం, టీఆరెస్ అధినేత కేసీఆర్ మోదీపై కత్తి దూస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఏకంగా కొత్త కూటమి ఏర్పాటుకే ఆయన రెడీ అవుతున్నారు.

ఇక ఏపీ విషయానికొస్తే మిత్రపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు దూరమవుతున్నారు. తనవి, బీజేపీవి అన్నితప్పులూ బీజేపీపైకే నెట్టేసి తాను సేఫ్ గా బయటపడాలన్న ప్రయత్నంలో ఉంటూ రాజకీయాలు నెరపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ లేకుండా సొంతంగా పోటీ చేయాల్సిన పరిస్థితి. దీంతో... 2014లో మోదీ హవా నడుస్తున్న సమయంలోనే నాలుగు సీట్లకు పరిమితమైన బీజేపీ ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న ముద్ర వేయించుకున్న సమయంలో సొంతంగా పోటీ చేస్తే డిపాజిట్లయినా దక్కుతాయా అన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో యూపీ నుంచి ఏపీ వరకు బీజేపీకి కష్టకాలం మొదలైనట్లే చెప్పుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు