ఓటుకు 5 వేలు వాళ్ల‌తో తీసుకుని జ‌న‌సేన‌కు ఓటెయ్యండి

ఓటుకు 5 వేలు వాళ్ల‌తో తీసుకుని జ‌న‌సేన‌కు ఓటెయ్యండి

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవిర్భావ స‌భ‌లో ఈరోజు అనేక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో తాను ఎన్నిక‌ల బ‌రిలో పూర్తిగా దిగుతున్న‌ట్లు చాలా స్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. వైసీపీపై పై ఏమేం ఆరోప‌ణ‌లు చంద్ర‌బాబు చేశారో ... ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక అవే త‌ప్పులు జ‌రిగాయ‌ని ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. లోకేష్ తో పాటు ప‌లువురు టీడీపీ ఎమ్మెల్యేల‌కు త‌లుపు బార్లా తెరిచార‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్... అవినీతితో తెగ సంపాదించారు. వారు డ‌బ్బులిచ్చి ఓట్లేయ‌మంటే... డ‌బ్బులు తీసుకోండి అని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. డ‌బ్బు తీసుకుని ఓటు మాత్రం జ‌న‌సేన‌కు వేయండి అని వ్యాఖ్యానించారు. వారు మాకే ఓట్లేయాల‌ని ఒట్టు వేయించుకుంటే ఒట్టు వేయండి... దేవుడితో నేను మాట్లాడ‌తా, వాళ్లు చేసే త‌ప్పుల‌కు దేవుడు వాళ్ల‌ను క్ష‌మించ‌డు. అదంతా మ‌న‌సొమ్మే అని ప‌వ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. ఏ పార్టీ వాళ్లు డ‌బ్బులిచ్చినా తీసుకోని ప‌వ‌న్ సూచించారు.

ఇక కొత్త నాయ‌క‌త్వం వ‌స్తుంది, ఎన్నుకోండి. కొత్త పార్టీ ఆవిర్భావించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను దేశ‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు, ప్ర‌తిప‌క్షాలు క‌ల్పించాయ‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఇక పార్టీకి విధి విధానాల‌కు సంబంధించి ఏమీ ప్ర‌క‌టించ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టి హామీ మాత్రం విక‌లాంగుల‌కు ఇచ్చారు. వారికి ఇల్లు, సేవకులు, ఉపాధి అన్నీ త‌మ చేతికి పాల‌న వ‌స్తే ఏర్పాటుచేస్తామ‌ని అన్నారు.

అన్ని విష‌యాలు ఇక్క‌డ చెప్ప‌లేను, వ‌చ్చే ఆగ‌స్టు 14-15 తేదీల్లో పార్టీ మ్యానిఫెస్టో విడుద‌ల చేస్తాం ఆరోజు అన్నీ తెలుస్తాయి అని ప‌వ‌న్ చెప్పారు. అయితే, పార్టీ ఎన్నిక‌ల దిశ‌గా వెళ్తున్న‌ట్టు స్ప‌ష్టంచేసిన ప‌వ‌న్ తొలి అడుగుగా స‌భ్య‌త్వం తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు. అయితే, మిగ‌తా పార్టీల్లాగా అది క్లిష్టంగా ఉండ‌ద‌ని, కేవ‌లం 9394022222 కు ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాల‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. మీకు ఓపిక‌, టైం ఉంటే మిగ‌తా వివ‌రాలు చెప్పొచ్చు. లేక‌పోతే మిస్డ్ కాల్ స‌రిపోతుంది అని అన్నారు. మొత్తానికి మేము ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నాం అని ఒకేప‌దంలో చెప్ప‌క‌పోయినా విడివిడిగా చెప్పిన మాట‌ల‌న్నీ విన్నాక వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఒంట‌రిగా పోటీ చేస్తున్న విష‌యం చాలా స్ప‌ష్ట‌మైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు