విందు భేటీలో మోడీని పడగొట్టే స్కెచ్ వేశారట

విందు భేటీలో మోడీని పడగొట్టే స్కెచ్ వేశారట

`మోడీని ఎలా ప‌డ‌గొడ‌దాం?` ఇదేదో పుస్త‌కం పేరు కాదు..పార్టీలో జ‌రిగిన అంత‌ర్గ‌త‌ చ‌ర్చ అంత‌కంటే కాదు. ఏకంగా 20 మంది  నేత‌లు వేసిన స్కెచ్. అది కూడా ఆషామాషీగా కాదు...మోడీని దించేందుకే విందు ఏర్పాటు చేసుకొని మ‌రీ రూపొందించిన ప్ర‌ణాళిక‌!.రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన బృహత్తర రాజకీయ వ్యూహంపై చర్చించేందుకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ మంగళవారం 20మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలకు విందు ఇచ్చారు. కేంద్రంలోని అధికార బీజేపీని నిలువరించేందుకు ఏ విధంగా ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేసుకోవాలన్న అంశంపై ఈ సందర్భంగా విస్తృత చర్చ జరిగినట్టు తెలుస్తోంది. భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చే లక్ష్యంతోనే సోనియా ఈ విందు దౌత్యం నెరపారని సన్నిహిత వర్గాల కథనం.

ఎన్‌సీపీ, ఆర్‌జేడీ, సమాజ్‌వాది పార్టీ, బీఎస్‌పీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎమ్‌కే, వామపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ విందుకు హాజరయ్యారని తెలుస్తోంది. 10జన్‌పథ్‌లో ఈ విందు జరిగిందని, 2019 ఎన్నికలకు సన్నద్ధతగా ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపైనా విపక్ష నేతలు చర్చించినట్టు చెబుతున్నారు. బీజేపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు చేతులు కలపాలని, ఇందుకోసం విబేధాలను పక్కన పెట్టి ఐక్యంగా నిలవాలని సోనియా ఇంతకు ముందు పిలుపునిచ్చారు. అయితే రాజకీయ అంశాలే ధ్యేయంగా ఈ సమావేశం జరుగలేదని, ప్రతిపక్ష పార్టీల మధ్య సానుకూల వాతావరణాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జరిగిందని కాంగ్రెస్ కమ్యూనికేషన్ల ఇన్‌చార్జి రణదీప్ సుర్జేవాలా వివరించారు. ముఖ్యంగా పార్లమెంట్ సక్రమంగా పని చేయడాన్ని ఎన్డీయే ప్రభుత్వం అడ్డుకుంటున్న నేపథ్యంలో విపక్షాలు తమ గళాన్ని వినిపించేందుకు సమైక్య ప్రయత్నం చేయడం సహజమన్నారు.

ఈ డిన్నర్‌కు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, సమాజ్‌వాదీ పార్టీకు చెందిన నాయకులు రాంగోపాల్‌ యాదవ్‌, బీఎస్పీకు చెందిన సతీష్‌ మిశ్రా, తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీనేత సుదీప్‌ బందోపాధ్యారు, సీపీఐ(ఎం)నేత మొహ్మద్‌ సలీం, టికె రంగరాజన్‌, సీపీఐ నాయకులు డి రాజా, జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా నేత బాబూలాల్‌ మరాండి, డీఎంకేకు చెందిన కనిమొళి, రాష్ట్రీయ లోక్‌ దళ్‌ చీఫ్‌ లజిత్‌ సింగ్‌, ఏఐయూడీఎఫ్‌ నాయకులు బద్రుద్దిన్‌ అజ్మల్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, హిందూస్థానీ ఆవాం మోర్చా నేత జితన్‌ రాం మాంజీ, ఎన్‌సీకు చెందిన ఓమర్‌ అబ్దుల్లాతోపాటు మరికొందరు ప్రముఖుల హాజరయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పార్టీ సీనియర్‌ నాయకులు మన్మోహన్‌ సింగ్‌, గులాం నబీ ఆజాద్‌, మల్లిఖార్జున్‌ ఖర్గేలు పాల్గొన్నారు. టీడీపీకి ఈ విందుకు ఆహ్వానం అందిన‌ప్ప‌టికీ హాజ‌రుకాలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు