బాబుకు ట్వీట్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన కేటీఆర్‌

బాబుకు ట్వీట్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన కేటీఆర్‌

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ఉద్య‌మంపై చంద్ర‌బాబు త‌న వైఖ‌రిని మార్చుకోవాల‌ని ఆయ‌న సూచించారు. చాలా గౌర‌వంతో తాము ఈ మాటలు చెప్తున్నామ‌ని పేర్కొంటూ ఓ ట్వీట్‌లో క్లారిటీ ఇచ్చారు. మంగళవారం విభజన చట్టం అమలుపై ఏపీ శాసనసభలో చర్చ సందర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ `సెంటిమెంట్‌తో డబ్బులు రావని, అలా ఇవ్వలేమని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. అదే సెంటిమెంట్‌తో తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా?`అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇదే మాట‌ల‌ను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ  సెంటి మెంట్ కోసమే 'తెలంగాణ' రాష్ట్రాన్ని ఇచ్చారనేది స‌రికాద‌ని పేర్కొన్నారు. చంద్ర‌బాబు అంటే గౌర‌వం ఉంద‌ని పేర్కొంటూ తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌ఫున ఆయ‌న చేస్తున్న కామెంట్ల‌ను తాను పూర్తిగా ఖండిస్తున్న‌ట్లు ట్వీట్ చేశారు. `చంద్ర‌బాబు గారు మీరు గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఉద్య‌మం ఆత్మ‌గౌర‌వం నినాదంతో సాగింది. ఉద్య‌మం స‌మ‌యంలో మాకు ప్యాకేజీ స‌హా మ‌రెన్నో ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. కానీ మేం రాష్ట్రం కోసం పోరాడాం... సాధించుకున్నాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల కోసం పోరాటం చేయండి తప్పేంలేదు. కానీ ఈ స‌మ‌యంలో తెలంగాణ ఉద్య‌మాన్ని త‌క్కువ చేయ‌కండి. మా రాష్ట్రం ఏర్పాటు కోసం త్యాగం చేసిన వారిని త‌క్కువ చేయ‌వ‌ద్దు` అంటూ ఘాటుగా ట్విట్ట‌ర్ స్పందించారు కేటీఆర్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English