మందు తాగ‌ద్దంటూ ఫ్యాన్స్‌కు ప‌వ‌న్ సూచ‌న‌

మందు తాగ‌ద్దంటూ ఫ్యాన్స్‌కు ప‌వ‌న్ సూచ‌న‌

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి జనం ముందుకు వస్తున్నారు. బుధవారం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించే సభను ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.  సుమారు నాలుగు లక్షల మంది ఈ సభకు వస్తారన్న అంచనా వ్యక్తమవుతున్నందున, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. సభ ఏర్పాట్లను పవన్ స్వయంగా పర్యవేక్షించి, నాయకులకు కొన్ని సూచనలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్‌కు కూడా కొన్ని సూచ‌న‌లు చేయ‌గా...అందులో ప‌లు సూచ‌న‌లు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయ‌ని ప‌లువురు అంటున్నారు. ఇందులో కొన్ని భ‌ద్ర‌త‌ప‌ర‌మైన సూచ‌న‌లు ఉండ‌గా...మ‌రికొన్ని ఆశ్చ‌ర్య‌ప‌రంగా ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా మ‌ద్యం తాగి స‌భ‌కు రావ‌ద్ద‌న‌డం ఏమిట‌ని షాక్ అవుతున్నారు. త‌మ గురించి ఎలాంటి భావ‌న‌తో ఇలాంటి సూచ‌న‌లు చేశార‌ని ప‌లువురు స్పందిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

14 సూచ‌న‌ల‌తో జ‌న‌సేన మార్గ‌ద‌ర్శ‌కాల‌తో ఫ్యాన్స్‌కు ప‌వ‌న్ క్లారిటీ ఇచ్చారు. స‌భ‌కు హాజ‌ర‌య్యేది మొద‌లుకొని కార్య‌క్ర‌మం ముగిసేవ‌ర‌కు ప‌లు అంశాలు ఉన్నాయి. ఇటు పార్టీని అటు ఫ్యాన్స్ ర‌క్ష‌ణ‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సూచ‌న‌లు చేశారు. కాగా, ఇప్ప‌టికే భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ప‌వ‌న్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసిన సంగ‌తి తెలిసిందే.

జ‌న‌సేన రూపొందించిన మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవి
1.టోల్ ప్లాజా సిబ్బందితో వివాదం పెట్టుకోవద్దు. 2. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగించకుండా వారికి దారి ఇవ్వాలి. 3. ఎల్లవేళలా క్రమశిక్షణ పాటించి పార్టీ హోదాని నిలబెట్టండి. 4. పోలీసులతో, ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండండి. 5. ప్రజలని గౌరవించండి. వారితో దురుసుగా ప్రవర్తించకండి. 6. మద్యం సేవించి వాహనం నడపకండి. 7. రోడ్లు మరియు ఇతర ప్రదేశాల్లో అనవసరంగా వాహనాలు ఆపకండి. 8. ఇతర వాహనాలని ఓవర్ టేక్ చేయకండి. అతి వేగం వద్దు, సాధారణ వేగంతో నడపండి. 9. ద్విచక్రవాహనాల సైలెన్సర్లు తీసి రోడ్లపై నడపకండి. 10. సభాస్థలిలో శాంతంగా ఉండండి, సాధారణ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వండి. 11. అనుక్షణం పార్టీ హోదాని నిలబెట్టండి. వ్యక్తిగత ప్రాధాన్యత కంటే పార్టీ ప్రాధాన్యత ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి. 12. చెట్లు, గోడలు, టవర్లు, స్పీకర్ల పైకి ఎక్కకండి. 13. విద్యుత్తు స్తంభాలకి దూరంగా ఉండండి. 14. జిల్లాలోని ప్రచారపత్రాల్లో పార్టీ ప్రెసిడెంట్ ఫోటో మరియు పార్టీ ఆమోదించిన వారి ఫోటోలు తప్ప వేరే ఎవరివీ ఉండకూడదు. క్షేమంగా వచ్చి, క్షేమంగా వెళ్లండి`` అని కోరారు.

ఇక ప్రధానంగా రాష్ట్రానికి హోదాపై చాలాకాలం నుంచీ గళం విప్పుతున్న పవన్ బుధవారం నాటి సభలో మరోసారి దానిపైనే ప్రధానంగా స్పందించనున్నారు. హోదా కావాలంటున్న ఏపీ పార్టీలకు జాతీయ, ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలు కూడా స్వరం కలుపుతున్న వైనాన్ని గుర్తు చేస్తూ, మరోసారి కేంద్రంపై నిప్పులు చెరగనున్నారు. ఇక ఇటీవలి కాలంలో తనను లక్ష్యంగా చేసుకుని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ చేస్తున్న విమర్శన అస్త్రాలకు పవన్ సభలోనే సమాధానం చెప్పనున్నారు. ప్రధానిపై నమ్మకం ఉందని చెబుతున్న వైసీపీ, మరోవైపు కేంద్రంపై అవిశ్వాసం పెడుతున్న తీరుపై సర్వత్రా ఆక్షేపణ వ్యక్తమవుతున్న నేపథ్యంలో అదే అంశంపై ఆయన వైసీపీ ద్వంద్వ విధానాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందులో ఆయన ప్రసంగం ప్రధాని వేరు కేంద్రం వేరా? అన్న దారిలో ఉండనుందంటున్నారు. ఇక చంద్రబాబు పాలనాతీరుపైనా చురకలు వేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల వినియోగంతోపాటు, కేంద్రం నుంచి బయయటకు వచ్చిన టీడీపీ ఎన్డీఏ నుంచి ఇంకా ఎందుకురాలేదన్న ప్రశ్న సంధించే అవకాశం ఉందంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English