ఇంత‌కీ జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ ఏం చెప్తారు?

ఇంత‌కీ జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ ఏం చెప్తారు?

జ‌న‌సేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయ‌బోయే ప్ర‌క‌ట‌న‌పై అన్నివ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది. జాతీయ రహదారి పక్కన ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఎదుట ఈ స‌భ జ‌ర‌గ‌నుంది. జ‌నసేన సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ సుమారు 4 లక్షల మంది రావచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది. తన సభకు భద్రతా ఏర్పాట్లతోపాటు, తన భద్రత కొనసాగించాలని ఆయన తాజాగా డీజీపీ మాలకొండయ్యకు లేఖ రాశారు. దానితో పవన్ అభ్యర్థన మేరకు పోలీసులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ సమన్వయకర్త మాదాసు గంగాధరం, పార్టీ కోశాధికారి రాఘవతో పవన్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్నారు. వేదిక ప్రాంతాన్ని పవన్ పరిశీలించి, మహిళలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని, ఎండ తీవ్రత దృష్ట్యా మంచినీరు, మజ్జిగ సౌకర్యం కల్పించాలని సూచించారు. బుధవారం 3 గంటలకు ప్రారంభమయ్యే సభ సుమారు ఐదుగంటల వరకూ కొనసాగవచ్చని, సభలో ఆయన ఒక్కరే ప్రసంగించే అవకాశం ఉందని స‌మాచారం.

రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, నిధులు, ప్రాజెక్టుల్లో నత్తనడక వంటి అంశాలతోపాటు, ప్రధానంగా ఆయన ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయనున్నారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. దానిపై ఆయన ఇటీవల నలుగురితో నియమించిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఇచ్చిన నివేదిక అంశాలను ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. నిధుల పంపిణీ, రాష్ట్రాలకు సమన్యాయం చేయకపోతే ఉత్తర-దక్షణాది రాష్ట్రాల భావన వస్తుందని గతంలోనే పవన్ హెచ్చరించగా, ఇప్పుడు అదే మాటను అటు కేసీఆర్, ఇటు చంద్రబాబునాయుడూ ప్రస్తావిస్తున్నారు. దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనమేమిటని, సొమ్ములు మావి సోకులు మీవా అంటూ ఇద్దరు చంద్రులు నిప్పులు కురిపిస్తున్నారు. పవన్ తన ప్రసంగంలో మరోసారి ఈ వివక్షపై నిప్పులు చెరిగే అవకాశం లేకపోలేదంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రావసరాల మేరకు రిజర్వేషన్లు పెంచుకునే అధికారంతోపాటు, రాష్ట్రాలపై కేంద్ర పెత్తనంపైనా విరుచుకుపడనున్నట్లు చెబుతున్నారు. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో వర్గీకరణ, ఏపీలో కాపులకు రిజర్వేషన్లు, వాల్మీకి, బోయలకు ఎస్టీ హోదా, తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్ల పెంపు అంశాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English