పవన్‌లో ఏమిటీ కొత్త భయం?

పవన్‌లో ఏమిటీ కొత్త భయం?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ డీజీపీకి రాసిన లేఖ సంచలనంగా మారింది. బుధవారం నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ సందర్భంగా పోలీసులు భద్రత కల్పిస్తుండంపై ధన్యవాదాలు చెబుతూనే ఆయన తన వ్యక్తిగత భద్రత విషయంలో చాలా కేర్ తీసుకోవాలని.. లేనిపక్షంలో తనకేమైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే... పవన్ తన పొలిటికల్ యాక్టివిటీ పెంచడం.. టీడీపీతోనూ విభేదిస్తూ సొంతంగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పవన్ ఎందుకు తనపై దాడి జరగొచ్చని అనుమానిస్తున్నారన్న అనుమానాలు చాలామంది వ్యక్తంచేస్తున్నారు.

    గుంటూరులోని నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా, 35 ఎకరాల విస్తీర్ణంలో రేపు జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ డీజీపీకి లేఖ రాశారు. అయితే, తనపై దాడి జరిగితే ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, గతంలో భీమవరంలో ఫ్లెక్సీ చింపేసినందుకే అభిమానులు ధర్నా చేశారని అన్నారు. ఇటీవల అనంతపురం పర్యటనలో తొక్కిసలాట ఘటన దృష్ట్యా భ్రదత కోరుతున్నానని పేర్కొన్నారు. భద్రతకు పోలీసులు నిస్సహాయత ప్రకటిస్తే ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

    అయితే.. రాష్ట్రంలో రాజకీయాలు ముదురుతున్న పవన్ పై దాడులు జరిగే పరిస్థితులు ఉండవని.. ఆయన హడావుడి కోసమే ఈ లేఖ రాశారన్న అభిప్రాయాలువినిపిస్తున్నాయి. కానీ.. పవన్ మాత్రం తనలేఖలో ప్రస్తుతం సమాజంలో కుల ఉద్యమాలు, వర్గ పోరాటాలు, రాజకీయ అణచివేతల మధ్య తనపై దాడి జరిగే అవకాశం ఉందనడంతో ఆయనకు ఎవరినుంచైనా బెదిరింపులు వచ్చాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. లేదంటే... సినిమాటిక్ పనులతో సింపథీ సంపాదించి రాజకీయాల్లో బలపడే వ్యూహముందా అన్న అనుమానాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు